Nandamuri Balakrishna: అందరికీ ఏజ్ పెరిగితే బాలయ్యకు క్రేజ్ పెరుగుతోంది... ఏ రంగంలోనైనా నెంబర్ వన్!: మంత్రి నారా లోకేశ్

Balakrishna Craze Increasing Says Minister Nara Lokesh
  • హీరోగా 50 ఏళ్లు పూర్తి 
  • వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన నందమూరి బాలకృష్ణ
  • హైదరాబాద్‌లో ఘనంగా కార్యక్రమం
  • చరిత్ర సృష్టించడం బాలయ్యకే సాధ్యమన్న మంత్రి నారా లోకేష్
  • సినిమా, రాజకీయాలు, ఓటీటీలో ఆయనే నంబర్ వన్ అని ప్రశంస
  • పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సినీనటి జయసుధ, ఇతర ప్రముఖులు
చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా హీరో నందమూరి బాలకృష్ణ వలనే సాధ్యమవుతుందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన బాలకృష్ణకు హైదరాబాద్ లోని ఒక హోటల్ లో పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, బాలయ్యను వేనోళ్ల కొనియాడారు.

"50 ఇయర్స్ ఇండస్ట్రీ. సినిమా, సేవా కార్యక్రమాలు, టెలివిజన్ షోస్, పాలిటిక్స్ ఎందులోనైనా బాలయ్య నంబర్ 1. విశ్వవిఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి తరువాత రాజకీయాల్లో హ్యాట్రిక్ సాధించిన ఒకే ఒక్క మాస్ మహారాజ్ బాలయ్య. హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ మాస్ మహారాజ్ కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. 1974లో తాతమ్మ కలతో మొదలైన సినీ ప్రయాణం అఖండ 2 వరకూ వచ్చింది. అందరికీ ఏజ్ పెరుగుతుంది కానీ బాలయ్య కు క్రేజ్ పెరుగుతుంది. ఇప్పటికి 109 సినిమాల్లో హీరోగా చేశారు. 100 రోజులు కాదు 1000 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి.

ఏదైనా బాలయ్యకే సాధ్యం

ఎవరైనా ఒక జానర్ లో సక్సెస్ అవుతారు. కానీ అన్ని జానర్స్ లో సినిమాలు తీసి ముద్ర వేసిన కథానాయకుడు బాలయ్య. పౌరాణికం, జానపదం, చారిత్రకం, ఆధ్యాత్మికం, సోషియో ఫాంటసీ, బయోపిక్, సైన్స్ ఫిక్షన్.. ఇలా పాత్ర ఏదైనా బాలయ్య కే సాధ్యం. గౌతమీ పుత్రశాతకర్ణి అని మీసం మెలేసినా ....అఖండ అని గర్జించినా బాలయ్యకే చెల్లింది. రాముడు, కృష్ణుడులో మనకు తెలిసిన రూపం నందమూరి తారక రామారావు గారిది. మళ్లీ అంతటి చూడచక్కని రూపం, నట విశ్వరూపం బాలయ్య బాబుదే. శ్రీరామరాజ్యం చిత్రంతో మళ్లీ మనందరికీ మరోసారి ఎన్టీఆర్‌ని గుర్తుకుతెచ్చారు.

ఓటిటి లోనూ బాలయ్యే మేటి

బాలయ్య నిర్మాతల హీరో, దర్శకుల హీరో, అభిమానుల హీరో. తన సినిమానే కాదు... సినిమా పరిశ్రమ కూడా బాగుండాలి అని భావించే నిజమైన హీరో. ఇప్పుడు ఓటీటీ వంతు వచ్చింది. బాలయ్య అక్కడా దుమ్ము రేపుతున్నారు. బాలయ్య షో చేస్తే రేటింగ్స్ రాకెట్లా దూసుకెళుతున్నాయి. ప్రేక్షకులకు అద్వితీయ వినోదాన్ని అందించారు. బాలయ్య అడుగు పెడితే ఎక్కడైనా అన్ స్టాపబుల్ అని ఆయన చేసిన రియాలిటీ షోనే నిదర్శనం. అన్ స్టాపబుల్ తో బాలయ్య ఓటీటీలో కూడా సత్తా చాటారు. మూడు నంది అవార్డులు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు వచ్చాయి.

బాలయ్య భోళా శంకరుడు

బాలయ్య అంటే భోలా శంకరుడు. స్వచ్చమైన మనసు బాలయ్యది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు. దాపరికం లేదు... ముందొకమాట వెనుక ఒకమాట ఉండదు. అదీ బాలయ్య స్టైల్! ప్రజలకు కష్టం వచ్చినప్పుడు సాయంలో ముందుంటారు. 2009 కృష్ణా వరదల్లో ముందుకు వచ్చి సాయం చేశారు. కరోనా సమయంలో ధైర్యంగా అఖండ సినిమా పూర్తి చేసి ఇండస్ట్రీలో ధైర్యాన్ని నింపారు. ఆ సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రూ.50 లక్షల చొప్పున సాయం చేశారు. మరో రూ.25 లక్షలు కరోనా విపత్తు సహాయం కోసం ఇచ్చారు..." అని లోకేశ్ వివరించారు.  

ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సినీనటి జయసుధ, పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Nandamuri Balakrishna
Nara Lokesh
Balakrishna movies
Unstoppable
NBK
Tollywood
Telugu cinema
Jai Balayya
World Book of Records
Akhanda 2

More Telugu News