Gurpatwant Singh Pannun: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం... రాజకీయ రంగు పులుముతున్నాడంటూ పన్నూన్ పై ఆరోపణలు!

Gurpatwant Singh Pannun Faces Backlash for Politicizing US Road Accident
  • ముగ్గురి మృతికి కారణమైన ట్రక్కర్‌ను బాధితుడిగా చిత్రీకరించే ప్రయత్నం
  • బాధిత కుటుంబాలకు లక్ష డాలర్ల పరిహారం ఆఫర్ చేయడంపై విమర్శలు
  • పన్నూన్ చర్యలను తీవ్రంగా ఖండించిన అమెరికాలోని సిక్కు సంఘాలు
  • ఇది పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొకటి కాదంటూ స్థానిక సిక్కుల ఆగ్రహం
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్ ఫర్ జస్టిస్' సంస్థ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అమెరికాలో ముగ్గురి మృతికి కారణమైన ఘోర రోడ్డు ప్రమాదానికి రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించి స్థానిక సిక్కు సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈ దుర్ఘటనకు కారణమైన భారత సంతతి ట్రక్కు డ్రైవర్‌ను బాధితుడిగా చిత్రీకరించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలేం జరిగింది?

ఈ నెల ప్రారంభంలో ఫ్లోరిడా టర్న్‌పైక్‌పై హర్జిందర్ సింగ్ అనే ట్రక్కు డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా యూటర్న్ తీసుకున్నాడు. దీంతో అతని భారీ వాహనం రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో, వేగంగా వస్తున్న మినీవ్యాన్ దానిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 30 ఏళ్ల హెర్బీ డుఫ్రెస్‌నే, 37 ఏళ్ల ఫానియోలా జోసెఫ్, 54 ఏళ్ల రోడ్రిక్ డోర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హర్జిందర్ సింగ్‌పై మూడు హత్య అభియోగాలు మోపారు.

పన్నూ జోక్యం.. వివాదం

ఈ విషాద ఘటనను పన్నూన్ తన వేర్పాటువాద ప్రచారానికి వాడుకునే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. డ్రైవర్ హర్జిందర్ సింగ్ చర్యను ఆయన "ఒక విషాదకరమైన పొరపాటు"గా అభివర్ణించారు. అంతేకాకుండా, మృతుల కుటుంబాలకు ఎస్‌ఎఫ్‌జే తరఫున 100,000 డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. అయితే, పన్నూన్ చర్యలను అమెరికాలోని అనేక సిక్కు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్న గిమ్మిక్కు అని, నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమని వారు ఆరోపించారు.

థాయ్‌లాండ్‌కు చెందిన 'పేజ్ 3 న్యూస్' కథనం ప్రకారం, మృతుల ఆత్మశాంతి కోసం ఫ్లోరిడాలో సిక్కు సమాజం నిర్వహించిన సంస్మరణ సభలో కూడా పన్నూన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై ఒక స్థానిక సిక్కు నేత మాట్లాడుతూ, "ఈ సభ మృతులను స్మరించుకోవడానికి ఏర్పాటు చేశాం. కానీ పన్నూన్ తన వేర్పాటువాద రాజకీయాలకు దీన్ని వేదికగా మార్చాలని చూస్తున్నారు. ఒక విషాదాన్ని అడ్డం పెట్టుకుని తన ఎజెండాను ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gurpatwant Singh Pannun
Khalistani terrorist
Sikhs for Justice
Harjinder Singh
Florida Turnpike accident
road accident USA

More Telugu News