Chandrababu Naidu: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన సైడ్ లైట్స్ ఇవిగో!

Chandrababu Naidu Kuppam Visit Highlights
  • తొలిసారిగా కుప్పానికి చేరిన హంద్రీ-నీవా జలాలు
  • ఆర్టీసీ బస్సులో మహిళలు, రైతులతో కలిసి ప్రయాణించిన సీఎం
  • ఉచిత బస్సు పథకంపై మహిళల హర్షం, నీళ్లు రావడంపై రైతుల ఆనందం
  • పాత అసెంబ్లీ వీడియోలు ప్రదర్శించి వైసీపీ తీరును ఎండగట్టిన చంద్రబాబు
  • కుప్పం బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనుల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం
  • నీటి ప్రవాహాన్ని ప్రజలకు లైవ్‌లో చూపాలని అధికారులకు ఆదేశం
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి కృష్ణా జలాలను తీసుకువచ్చి చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. హంద్రీ-నీవా జలాలు తొలిసారిగా కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు చేరిన సందర్భంగా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి, స్థానిక ప్రజల ఆనందంలో పాలుపంచుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా సామాన్యుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం, ప్రజలతో మమేకం కావడం, గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం వంటి అంశాలు ప్రధానంగా నిలిచాయి.

1. ఆర్టీసీ బస్సులో ప్రజలతో మమేకం
తన పర్యటనను వినూత్నంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కుప్పంలోని తన నివాసం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. 'స్త్రీ శక్తి' పథకంలో భాగంగా మహిళలు, రైతులతో కలిసి ఆయన బస్సులో ప్రయాణిస్తూ వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఉచిత బస్సు సౌకర్యం ఎలా ఉందని మహిళలను ఆరా తీయగా, వారు ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచితంగా ప్రయాణిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. "హంద్రీ-నీవా నీళ్లు తొలిసారి మన కుప్పానికి వచ్చాయి, కాలువల్లో నీళ్లు చూశారా? చెరువులు నిండాయా?" అని రైతులను అడిగి తెలుసుకున్నారు. దశాబ్దాల తర్వాత కృష్ణమ్మ కుప్పం గడ్డపై అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందని రైతులు, మహిళలు ముఖ్యమంత్రికి తెలిపారు.

2. జలహారతి.. పడవలో చెరువు పరిశీలన
కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్దకు చేరుకున్న చంద్రబాబు, కృష్ణా జలాలకు శాస్త్రోక్తంగా పూజలు చేసి జలహారతి ఇచ్చారు. ఇదే సమయంలో కుప్పం నియోజకవర్గంలోని 60కి పైగా గ్రామాల్లో ప్రజలు ఏకకాలంలో జలహారతులు పట్టి తమ సంతోషాన్ని చాటుకున్నారు. అనంతరం, బహిరంగ సభకు హాజరయ్యే ముందు ఆయన పడవలో పరమ సముద్రం చెరువులోకి వెళ్లి నీటిమట్టాన్ని, చెరువు పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.

3. సభలో వీడియోల ప్రదర్శన.. వైసీపీపై విమర్శలు

బహిరంగ సభలో చంద్రబాబు తనదైన శైలిలో ప్రసంగించారు. 2014-19 మధ్య అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చకు సంబంధించిన వీడియోలను సభలో ప్రదర్శించారు. "జగన్ అడ్డంగా పడుకున్నా సరే, ప్రతి నియోజకవర్గానికి నీళ్లిచ్చి తీరతాం" అని నాడు తాను సభలో స్పష్టం చేసిన వీడియోను చూపించడంతో సభికులు చప్పట్లతో మద్దతు తెలిపారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు తరలించి, కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకువచ్చే ప్రణాళికను గతంలో వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆయన విమర్శించారు. 2019 తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్లే రాయలసీమకు నీరు చేరలేదని ఆరోపించారు.

4. అభివృద్ధి పనులకు శ్రీకారం, అధికారులకు ఆదేశాలు
ఈ పర్యటనలో భాగంగా హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనుల పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం కాలువ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రిజర్వాయర్లలోకి నీరు ఎలా చేరుతోంది, ప్రవాహాలు ఏ విధంగా వస్తున్నాయనే విషయాలను సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు లైవ్‌లో చూపించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీటి విలువ, ప్రభుత్వం పెడుతున్న ఖర్చు, ఎంత వేగంగా నీటిని తరలించామనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు లైవ్ డెమాన్‌స్ట్రేషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొత్తంగా ఈ పర్యటన కుప్పం ప్రజలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Chandrababu Naidu
Kuppam
Handri Neeva
Krishna water
irrigation project
Andhra Pradesh
TDP
YSRCP
water resources
political tour

More Telugu News