భారత్-ఆసీస్ సిరీస్‌కు భారీ క్రేజ్... ఆరంభానికి ముందే టికెట్లన్నీ సోల్డ్ అవుట్!

  • అక్టోబర్‌లో ప్రారంభం కానున్న టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన
  • ఇండియన్ ఫ్యాన్ జోన్ టికెట్లు పూర్తిగా విక్రయం
  • మ్యాచ్‌లకు 50 రోజుల ముందే టికెట్లు అమ్ముడవడంపై క్రికెట్ ఆస్ట్రేలియా హర్షం
  • భారత అభిమానుల్లో ఈ సిరీస్‌పై కనిపిస్తున్న భారీ ఆసక్తి
  • పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు
  • సిడ్నీ, కాన్‌బెర్రాలోని పబ్లిక్ టికెట్లు కూడా అందుబాటులో లేవన్న సీఏ
ఆస్ట్రేలియాలో టీమిండియా అడుగుపెట్టకముందే అభిమానుల సందడి మొదలైంది. త్వరలో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌కు సంబంధించి టికెట్లు అమ్మకానికి పెట్టిన కొద్దిసేపటికే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సిరీస్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, అభిమానులు టికెట్ల కోసం ఎగబడటంతో ఈ అనూహ్య స్పందన లభించింది.

ముఖ్యంగా భారత అభిమానుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన 'ఇండియన్ ఫ్యాన్ జోన్' టికెట్లు పూర్తిగా అమ్ముడైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. కేవలం ఫ్యాన్ జోన్ మాత్రమే కాకుండా, సిడ్నీ, కాన్‌బెర్రా నగరాల్లోని సాధారణ పబ్లిక్ టికెట్లు కూడా అయిపోయాయని స్పష్టం చేసింది. ఈ పరిణామం ఇరు జట్ల మధ్య జరగబోయే పోరుపై ఉన్న అంచనాలకు అద్దం పడుతోంది.

ఈ అనూహ్య స్పందనపై క్రికెట్ ఆస్ట్రేలియా ఈవెంట్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ జోయెల్ మోరిసన్ హర్షం వ్యక్తం చేశారు. "సిరీస్ ఆరంభానికి ఇంకా 50 రోజుల సమయం ఉండగానే టికెట్లు అమ్ముడైపోవడం అభిమానుల ఉత్సాహానికి నిదర్శనం. ఈ స్పందన మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది" అని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

వన్డే సిరీస్
* అక్టోబర్ 19: మొదటి వన్డే - పెర్త్ స్టేడియం
* అక్టోబర్ 23: రెండో వన్డే - అడిలైడ్ ఓవల్
* అక్టోబర్ 25: మూడో వన్డే - సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)

టీ20 సిరీస్
* అక్టోబర్ 29: మొదటి టీ20 - మనుకా ఓవల్, కాన్‌బెర్రా
* అక్టోబర్ 31: రెండో టీ20 - మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)
* నవంబర్ 2: మూడో టీ20 - బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్
* నవంబర్ 6: నాలుగో టీ20 - గోల్డ్ కోస్ట్ స్టేడియం
* నవంబర్ 8: అయిదో టీ20 - ది గబ్బా, బ్రిస్బేన్


More Telugu News