Team India: బెంగళూరులో రోహిత్, గిల్, బుమ్రా సహా పలువురు ఆటగాళ్లకు ఫిట్‌నెస్ పరీక్షలు

Indian Cricket Team Fitness Tests for Rohit Sharma and Key Players
  • బెంగళూరులోని సీఓఈలో టీమిండియా ప్రీ-సీజన్ ఫిట్‌నెస్ పరీక్షలు 
  • హాజ‌రైన‌ రోహిత్, గిల్, బుమ్రా, జైస్వాల్, సిరాజ్
  • కోహ్లీ హాజరుపై ఇంకా లేని స్పష్టత 
  • కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో కఠినంగా మారిన ఫిట్‌నెస్ నిబంధనలు
భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్‌ను ముగించేందుకు రంగం సిద్ధమైందా? అంటే అవుననే అంటున్నాయి కొన్ని వాదనలు. టీమిండియాలో తాజాగా ప్రవేశపెట్టిన 'బ్రోంకో టెస్ట్' వెనుక ఉన్న అసలు ఉద్దేశం రోహిత్‌ను 2027 ప్రపంచ కప్ జట్టు నుంచి తప్పించడమేనని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో భారత క్రికెట్‌లో కొత్త వివాదం రాజుకుంది.

శనివారం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో టీమిండియా ప్రీ-సీజన్ ఫిట్‌నెస్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్ వంటి కీలక ఆటగాళ్లు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆటగాళ్లకు ఎముకల సాంద్రతను తెలిపే డెక్సా స్కాన్, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమైన విరాట్ కోహ్లీ ఈ పరీక్షలకు హాజరవుతున్నాడా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు.

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కొందరు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఆందోళనలు వ్యక్తమవడంతో బీసీసీఐ ఈ కొత్త 'బ్రోంకో టెస్ట్'ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, ఆటగాళ్లు 20, 40, 60 మీటర్ల దూరాన్ని పలుమార్లు వేగంగా పరిగెత్తాల్సి ఉంటుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ కఠినమైన ఫిట్‌నెస్ పరీక్షకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ మాట్లాడుతూ, "భారత క్రికెట్‌లో ప్రవేశపెట్టిన అత్యంత కఠినమైన ఫిట్‌నెస్ పారామీటర్లలో బ్రోంకో టెస్ట్ ఒకటి. అయితే నా అనుమానం ఏంటంటే.. భవిష్యత్తులో జట్టులో వద్దనుకుంటున్న రోహిత్ శర్మ వంటి ఆటగాళ్ల కోసమే దీన్ని తీసుకొచ్చారు. ఈ టెస్టుతో అతడిని ఆపేస్తారని నేను భావిస్తున్నాను. అసలు హఠాత్తుగా ఇప్పుడే ఈ టెస్ట్ ఎందుకు పెట్టారు? ఇది ఎవరి ఆలోచన?" అని తివారీ తీవ్ర ప్రశ్నలు సంధించారు. 38 ఏళ్ల రోహిత్, 36 ఏళ్ల కోహ్లీ ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించగా, వారి వన్డే భవిష్యత్తుపై కూడా అనిశ్చితి నెలకొంది.

మరోవైపు, కాంట్రాక్ట్ ప్రకారం ఆటగాళ్లందరూ సీజన్‌కు ముందు ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరుకావడం తప్పనిసరి అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్ స్థాయిని అంచనా వేసి, వారు ఏయే అంశాల్లో మెరుగుపడాలో తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని ఆయన వివరించారు.
Team India
Rohit Sharma
Indian Cricket
Bronco test
Fitness test
Shubman Gill
Jasprit Bumrah
Virat Kohli
Manoj Tiwary
BCCI
Team India

More Telugu News