Nara Lokesh: భారత మహిళా క్రికెటర్లతో మంత్రి లోకేశ్ ముఖాముఖి

Nara Lokesh Meets Women Cricketers Discusses Sports Plan
  • రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక
  • విద్య, ఉద్యోగాల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటా
  • యువ క్రీడాకారులకు స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ సౌకర్యం
  • గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక చర్యలు
  • ఆటలను సబ్జెక్టుగా చేర్చాలని మహిళా క్రికెటర్ల సూచన
ఏపీలో క్రీడారంగానికి కొత్త ఊపునిచ్చేందుకు ప్రభుత్వం పటిష్ఠ‌మైన చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రాబోయే పదేళ్ల కోసం ఒక సమగ్ర ప్రణాళిక (రోడ్‌మ్యాప్) సిద్ధం చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. క్రీడాకారులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పెద్దపీట వేస్తూ స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచినట్లు ఆయన ప్రకటించారు.

శుక్రవారం భారత మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన "బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేశ్‌" అనే ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు, వార్షిక కోచింగ్ క్యాంపులు, హాస్టల్ వసతులు, ప్రయాణ భత్యాలు వంటివి అందిస్తోందని తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పోటీలు నిర్వహిస్తూ దివ్యాంగ క్రీడాకారులకు సైతం అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించి, హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ విలేజ్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని లోకేశ్ గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఏపీలో క్రీడలను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.

ఈ సందర్భంగా మహిళా క్రికెటర్ల విజయాలను మంత్రి అభినందించారు. "ఒకప్పుడు పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌ను చిన్నచూపు చూసేవారు. సరైన సౌకర్యాలు, మీడియా కవరేజీ లేకపోయినా మీరు అద్భుతమైన ప్రతిభతో భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చారు" అని ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం (2022), ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ (2025), ఏడు ఆసియా కప్ విజయాలు వారి పోరాట పటిమకు నిదర్శనమని అన్నారు.

మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు అందించాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని లోకేశ్ స్వాగతించారు. క్రీడల్లో లింగ వివక్షను రూపుమాపేందుకు ఇది కీలకమైన అడుగు అని, అయితే క్షేత్రస్థాయిలో సౌకర్యాలు కల్పించడం ద్వారానే యువతుల క్రీడా కలలు నెరవేరతాయని అభిప్రాయపడ్డారు.

క్రికెటర్ల సూచనలు
ఈ కార్యక్రమంలో మహిళా క్రికెటర్లు పలు సూచనలు చేశారు. క్రీడాకారులైన విద్యార్థుల కోసం ప్రత్యేక అకడమిక్ కరికులం రూపొందించాలని, పాఠశాల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పటిష్ఠ‌మైన క్రీడా వ్యవస్థను నిర్మించాలని కోరారు. పేద క్రీడాకారులకు స్కాలర్‌షిప్‌లు, స్పోర్ట్స్ కిట్లు అందించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యలో క్రీడలను ఒక ప్రత్యేక సబ్జెక్టుగా చేర్చాలని వారు అభిప్రాయపడ్డారు.
Nara Lokesh
AP sports
Andhra Pradesh sports
Indian women's cricket team
Sports quota
Sports development AP
Cricket
Roadmap for sports
Sports scholarships
Sports in education

More Telugu News