Sreesanth: శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపదెబ్బ కొట్టాడిలా.. 17 ఏళ్ల తర్వాత వెలుగులోకి వీడియో.. మీరూ చూడండి!

Sreesanth Harbhajan Slapgate Video Surfaces After 18 Years
  • దాదాపు 17 ఏళ్ల తర్వాత బయటపడ్డ ఐపీఎల్ స్లాప్‌గేట్ వీడియో
  • మైఖేల్ క్లార్క్ పాడ్‌కాస్ట్‌లో ఫుటేజీని విడుదల చేసిన లలిత్ మోదీ
  • హర్భజన్, శ్రీశాంత్ చెంపదెబ్బ వివాదంపై వీడిన ఉత్కంఠ
  • తన సెక్యూరిటీ కెమెరాలో ఘటన రికార్దయిందన్న లలిత్  
  • ప్రస్తుతం మంచి స్నేహితులుగా ఉన్న హర్భజన్, శ్రీశాంత్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద ఘటనగా నిలిచిపోయిన 'స్లాప్‌గేట్' ఉదంతానికి సంబంధించిన అసలు వీడియో దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఎస్ శ్రీశాంత్ మధ్య జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తాజాగా విడుదల చేశారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ నిర్వహిస్తున్న 'బియాండ్23' అనే పాడ్‌కాస్ట్‌లో ఆయన ఈ వీడియోను ప్రసారం చేశారు. ఇన్నాళ్లుగా దాచిపెట్టిన ఈ వీడియో బయటకు రావడంతో క్రికెట్ వర్గాల్లో మరోసారి ఈ అంశంపై చర్చ మొదలైంది.

2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పుడు మ్యాచ్ ప్రసారాలు ముగియడంతో అసలేం జరిగిందో ఎవరికీ తెలియలేదు. కానీ, మైదానంలో శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మాత్రం క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించాయి. ఒకే దేశానికి ఆడే ఇద్దరు సహచరుల మధ్య గొడవ జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సీనియర్ ఆటగాడైన హర్భజన్, జూనియర్ అయిన శ్రీశాంత్‌పై చేయి చేసుకోవడంతో ఈ వివాదంపై తీవ్ర చర్చ నడిచింది.

ఈ ఘటనపై లలిత్ మోదీ మాట్లాడుతూ "ఆ రోజు మైదానంలో ఏం జరిగిందో నేను మీకు చెబుతాను. నా దగ్గర భద్రంగా ఉన్న ఆ వీడియోను మీకు ఇస్తాను. మ్యాచ్ ముగిసి, లైవ్ కెమెరాలన్నీ ఆగిపోయాయి. కానీ నా సెక్యూరిటీ కెమెరాలలో ఒకటి ఆన్‌లోనే ఉంది. ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న సమయంలో, శ్రీశాంత్ వంతు రాగానే హర్భజన్ 'ఇలా రా' అని పిలిచి వెనక్కితిప్పి చెంపపై కొట్టాడు" అని వివరించారు.

అయితే, ఈ వివాదం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య విభేదాలు సమసిపోయాయి. పాత విషయాలను మరిచిపోయి వారిద్దరూ ఇప్పుడు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.
Sreesanth
Harbhajan Singh
IPL slapgate
Lalit Modi
Michael Clarke
Beyond23 podcast
Mumbai Indians
Kings XI Punjab
IPL controversy
Indian cricket

More Telugu News