Harbhajan Singh: వరద బాధితుల పరామర్శను విహారయాత్రలా ఫీలయిన పంజాబ్ మంత్రులు.. వీడియో ఇదిగో!

Punjab Ministers Flood Visit Sparks Controversy
  • బోటులో వెళుతూ స్వీడన్ విహారయాత్ర గుర్తుకుతెచ్చుకున్న మంత్రులు
  • హర్భజన్ సింగ్ సహా ఆప్ మంత్రులపై మండిపడుతున్న నెటిజన్లు
  • గుక్కెడు నీళ్ల కోసం బాధితులు తపిస్తుంటే మీకు విహారయాత్ర గుర్తొచ్చిందా అంటూ విమర్శలు
భారీ వర్షాలకు ఊళ్లు మునిగిపోతే సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించడానికి, బాధితులను పరామర్శించేందుకు ప్రజాప్రతినిధులు వెళ్లడం చూస్తుంటాం.. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడానికి, అవసరమైన తక్షణ సాయం అందించే ఉద్దేశంతో నేతలు పర్యటిస్తుంటారు. పంజాబ్ మంత్రుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి, బాధితుల కష్టాలను వినేందుకు వెళ్లిన మంత్రులు తమ విహారయాత్రల గురించి మాట్లాడుకున్నారు.

వరద నీటిలో ముగ్గురు మంత్రులు బోటులో ప్రయాణిస్తూ.. స్వీడన్, గోవాలలో బోటు యాత్రల అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఇందులో రాజకీయ నేతగా మారిన మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఉండడం గమనార్హం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల తీరుపై మండిపడుతున్నారు. ఓవైపు వరదల్లో చిక్కుకుని గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు ఆర్తనాదాలు చేస్తుంటే మంత్రులకు విహార యాత్ర చేసినట్లుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ప్రజల కష్టాలపై కనీస సానుభూతి కూడా లేని ఇలాంటి నేతలను పంజాబీలు ఎన్నటికీ క్షమించబోరని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.
Harbhajan Singh
Punjab floods
Punjab ministers
India floods
Flood relief
Boat trip
Sweden
Goa
Political criticism
Social media

More Telugu News