Araku Coffee: అరకు కాఫీకి కొత్త కష్టం.. గిరిజన రైతుల గుండెల్లో గుబులు

Araku Coffee Faces New Threat Coffee Berry Borer Worries Tribal Farmers
  • అరకు కాఫీ తోటల్లో తొలిసారిగా 'కాఫీ బెర్రీ బోరర్' తెగులు గుర్తింపు
  • కాఫీ గింజలను పూర్తిగా తొలిచివేస్తున్న ప్రమాదకరమైన కీటకం
  • అరకులోయ మండలం పకనకుడి గ్రామంలోని ఓ తోటలో వెలుగులోకి
  • యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టిన కేంద్ర కాఫీ బోర్డు
  • ఏజెన్సీ వ్యాప్తంగా 11 మండలాల్లో ప్రత్యేక సర్వేలు ప్రారంభం
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన అరకు కాఫీకి సరికొత్త ముప్పు ఎదురైంది. కాఫీ పంటను సర్వనాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన ‘కాఫీ బెర్రీ బోరర్’ తెగులు ఏజెన్సీ ప్రాంతంలో తొలిసారిగా వెలుగుచూడటం గిరిజన రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2000లో ఈ తెగులును హవాయిలో గుర్తించారు. అంతర్జాతీయంగా కాఫీ తోటలను నాశనం చేసే ఈ తెగులును మొదటిసారిగా మన ప్రాంతంలో గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

వారం రోజుల క్రితం అరకులోయ మండలం, పకనకుడి గ్రామంలోని సిరగం సువర్ణ అనే రైతుకు చెందిన కాఫీ తోటలో ఈ తెగులును కేంద్ర కాఫీ బోర్డు అధికారులు గుర్తించారు. పకనకుడి గ్రామంతో పాటు పరిసర మాలిసింగరం, మాలివలస, తుర్రయిగూడు, మంజగూడలోనూ కొన్ని మొక్కల్లో ఈ తెగులు కనిపించినట్టు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. ‘హైపోథెనెమస్’ అనే ఈ కీటకం కాఫీ పండులోకి రంధ్రం చేసుకుని ప్రవేశిస్తుంది. లోపలున్న గింజను పూర్తిగా తినేసి, అక్కడే సొరంగాలు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడుతుంది.

ఒక్కో కీటకం 50కి పైగా కాఫీ కాయ/పండు లోపల ఏర్పాటు చేసుకున్న సొరంగంలో గుడ్లు పెడుతుంది. 35 రోజులకు ఒక్కో గింజ నుంచి 30 నుంచి 40 కీటకాలు పుట్టుకొచ్చి, ఇతర కాయలకు వేగంగా వ్యాపిస్తాయి. ఈ విధంగా పంటను పూర్తిగా నాశనం చేసే శక్తి ఈ తెగులుకు ఉంది. ఈ తెగులు ఉనికిని గుర్తించిన వెంటనే కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. తెగులు నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తూ, తెగులు వ్యాప్తిని అంచనా వేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
Araku Coffee
Coffee Berry Borer
Araku Valley
Tribal Farmers
Coffee Disease
Andhra Pradesh
Coffee Plantation
Pakanakudi
Central Coffee Board
Hypothenemus

More Telugu News