ఈ సమయంలో ఒలింపిక్స్ క్రీడల గురించి సమీక్ష చేస్తారా?: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు
  • రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు సీఎం తీరు
  • భారీ వర్షాలతో కామారెడ్డి పట్టణానికి పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు
  • ప్రజలు కష్టాల్లో ఉంటే ఒలింపిక్స్, మూసీ సుందరీకరణపై సమావేశాలా అని ప్రశ్న
  • మరో నాలుగు రోజులు వర్ష సూచన ఉన్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ముఖ్యమంత్రి మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రోమ్ నగరం అగ్నికి ఆహుతవుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన చందంగా ముఖ్యమంత్రి వ్యవహారిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

భారీ వర్షాల కారణంగా కామారెడ్డి పట్టణానికి రోడ్డు మార్గాలన్నీ మూసుకుపోయి, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి, ఇతర అంశాలపై దృష్టి పెట్టడం దారుణమని అన్నారు.

రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా, ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదని కేటీఆర్ ఆరోపించారు. క్లిష్ట సమయంలో ప్రజల సమస్యలను పరిష్కరించడం విస్మరించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ నిర్వహణ, మూసీ నది సుందరీకరణ వంటి అంశాలపై సమావేశాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని, రైతులకు ఎకరాకు రూ. 25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.


More Telugu News