Vangalapudi Anitha: తక్షణమే అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయండి: హోం మంత్రి అనిత

Vangalapudi Anitha Orders Control Rooms Setup in All Districts
  • బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు
  • పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష
  • సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేయాలని సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలపై దృష్టి సారించిన మంత్రులు... అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు.

వర్షాల పరిస్థితిపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల కలెక్టర్లతో ఆమె ఫోన్‌లో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా కృష్ణా నది పరీవాహక ప్రాంతాలు, ఇతర లోతట్టు ప్రాంతాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను, రహదారులపై కూలిన చెట్లను వెంటనే తొలగించాలని మంత్రి ఆదేశించారు.

మరోవైపు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్రలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో భద్రతా కారణాల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల మినహా పెద్దగా సమస్యలు తలెత్తలేదని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని గొట్టిపాటి సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపుల సమయంలో విద్యుత్ తీగల పట్ల సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు.
Vangalapudi Anitha
AP Rains
Andhra Pradesh Floods
Gottipati Ravikumar
Control Rooms
NDRF
SDRF
Heavy Rainfall
AP Government
Disaster Management

More Telugu News