Bandi Sanjay: తెలంగాణకు ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యం.. రంగంలోకి దిగిన బండి సంజయ్!

Army Helicopter Delay Bandi Sanjay Contacts Defence Officials
  • వరద సహాయక చర్యలకు ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యం
  • రక్షణ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన బండి సంజయ్
  • ప్రతికూల వాతావరణమే ఆలస్యానికి కారణమని వెల్లడించిన అధికారులు
తెలంగాణలో వరద సహాయక చర్యల కోసం ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యం కావడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. ఆయన నేరుగా రక్షణ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రంలో వరదల తీవ్రత, సహాయక చర్యల ఆవశ్యకతను వారికి వివరించారు.

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా మారిందని, ఇదే హెలికాప్టర్ల రాకకు ప్రధాన అడ్డంకిగా నిలిచిందని రక్షణ శాఖ అధికారులు బండి సంజయ్‌కు తెలిపారు. తెలంగాణ కోసం ఇప్పటికే మూడు హెలికాప్టర్లను సిద్ధం చేశామని, అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో అవి బయలుదేరలేకపోతున్నాయని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్, కర్ణాటకలోని బీదర్ వైమానిక స్థావరాల నుంచి హెలికాప్టర్లను పంపేందుకు ప్రయత్నిస్తున్నామని వారు బండి సంజయ్‌కు తెలియజేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ రాష్ట్రంలోని వరద తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఎస్సారెస్పీ, మానేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని వివరించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహాయపడడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. పరిస్థితుల దృష్ట్యా వీలైనంత త్వరగా హెలికాప్టర్లను పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. 
Bandi Sanjay
Telangana floods
Army helicopters
Flood relief
NDRF
Defence ministry
Telangana rains
SSRSP
Manair river

More Telugu News