Palghar Building Collapse: ముంబై సమీపంలో పెను విషాదం.. భవనం కూలి 14 మంది మృతి!

Palghar Building Collapse Kills 14 in Maharashtra
  • విరార్‌లో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
  • పక్కనే ఉన్న చాల్‌పై పడిన అపార్ట్‌మెంట్ శిథిలాలు
  • గతంలోనే ప్రమాదకరమైనదిగా ప్రకటించిన మున్సిపల్ అధికారులు
  • రాత్రంతా కొనసాగిన ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు
  • శిథిలాల కింద మరికొందరు వుండచ్చనే ఆందోళన
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో నాలుగంతస్తుల నివాస భవనం ఒకటి కుప్పకూలిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

విరార్‌లోని నారంగి ఫాటా వద్ద ఉన్న రాము కాంపౌండ్‌లోని రమాబాయి అపార్ట్‌మెంట్ భవనం నాలుగో అంతస్తుకు చెందిన వెనుక భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ శిథిలాలు పక్కనే ఉన్న ఒక చాల్ (చిన్న ఇళ్ల సముదాయం) మీద పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, వసాయ్ విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక సిబ్బంది, రెండు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

రాత్రంతా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు శిథిలాల నుంచి 11 మందిని సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని విరార్, నలసోపారాలోని ఆసుపత్రులకు తరలించారు. కొందరికి ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు.

సుమారు పదేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని 'అత్యంత ప్రమాదకరమైనది'గా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గతంలోనే గుర్తించి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. శిథిలాల కింద ఇంకా 10 నుంచి 11 మంది వరకు చిక్కుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Palghar Building Collapse
Maharashtra building collapse
Virar building collapse
NDRF
building collapse India
Mumbai news
Virar news
Palghar news
apartment collapse
disaster management

More Telugu News