భారత్ శాంతినే కోరుకుంటుంది.. కానీ కవ్విస్తే ఊరుకోం: రాజ్‌నాథ్ సింగ్

  • భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోద‌న్న రాజ్‌నాథ్ సింగ్
  • కానీ కవ్విస్తే మాత్రం గట్టిగా బదులిస్తామ‌ని వెల్ల‌డి
  • ఇకపై టెక్నాలజీ, సైబర్ స్పేస్‌దే కీలక పాత్ర అన్న రక్షణ మంత్రి 
  • రక్షణ సన్నద్ధతను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య‌
భారత్ ఎన్నడూ యుద్ధాన్ని కోరుకోదని, ఏ దేశంపైనా దురాక్రమణకు పాల్పడలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే, దేశ సార్వభౌమత్వానికి ఎవరైనా సవాలు విసిరితే మాత్రం అత్యంత కఠినంగా, నిర్ణయాత్మకంగా బదులిస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు. మారుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు రక్షణ సన్నద్ధతను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.

మధ్యప్రదేశ్‌లోని మౌలో ఉన్న ఆర్మీ వార్ కాలేజీలో బుధవారం జరిగిన 'రణ్-సంవాద్ 2025' త్రివిధ దళాల సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్‌ కుమార్ త్రిపాఠి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, "భారతదేశం శాంతి కాముక దేశమని, మేం ఎప్పుడూ యుద్ధాన్ని ప్రారంభించలేదు. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మాకు దురాక్రమణ ఆలోచన లేనప్పటికీ, ఎవరైనా మమ్మల్ని సవాలు చేస్తే, బలంతో స్పందించడం తప్పనిసరి అవుతుంది" అని అన్నారు.

ఆధునిక కాలంలో యుద్ధాల స్వరూపం వేగంగా మారిపోతోందని రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. కేవలం సైనికుల సంఖ్య లేదా ఆయుధాల నిల్వలు మాత్రమే విజయాన్ని నిర్ధారించలేవని స్పష్టం చేశారు. "సైబర్ వార్‌ఫేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, ఉపగ్రహ ఆధారిత నిఘా భవిష్యత్ యుద్ధాలను నిర్దేశిస్తాయి. ఇకపై యుద్ధాలు భూమి, సముద్రం, గగనతలంతో పాటు అంతరిక్షం, సైబర్‌స్పేస్‌లో కూడా జరుగుతాయి" అని ఆయన వివరించారు.

భవిష్యత్ యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే కాకుండా టెక్నాలజీ, నిఘా, ఆర్థిక వ్యవస్థ, దౌత్యం కలయికతో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. సాంకేతికత, వ్యూహం, పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యం ఉన్న దేశమే ప్రపంచ శక్తిగా ఎదుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.


More Telugu News