Vijay Actor: తమిళ నటుడు విజయ్‌, 10 మంది బౌన్సర్లపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు

Case Filed Against Actor Vijay and 10 Bouncers
  • ఈ నెల 21న మదురైలో భారీ బహిరంగ సభ
  • విజయ్‌ను కలిసేందుకు ర్యాంప్‌పైకి దూకేందుకు యువకుల ప్రయత్నం
  • బౌన్సర్లు అడ్డుకుని తోసివేయడంతో శరత్‌కుమార్ అనే యువకుడికి గాయాలు
  • అతడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రముఖ తమిళ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌ సహా పదిమంది బౌన్సర్లపై కేసు నమోదైంది. ఈ నెల 21న మదురైలో నిర్వహించిన టీవీకే సభలో లక్షలాదిమంది పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తలను విజయ్ కలిసేందుకు వీలుగా సభా వేదికపై ర్యాంప్ ఏర్పాటు చేశారు. దానిపై విజయ్ నడుస్తున్నప్పుడు పలువురు యువకులు ర్యాంప్ వాక్ వేదిక పైకి పరిగెత్తారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. 

ఈ క్రమంలో పెరంబలూరు జిల్లా కున్నం సమీపంలోని పెరియమ్మపాళయానికి చెందిన 24 ఏళ్ల శరత్‌కుమార్ ర్యాంప్ వాక్ వేదికపైకి ఎక్కి విజయ్‌ను కలిసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్లు అతడిని అడ్డుకుని కిందికి తోసివేశారు. కిందపడిన శరత్‌కుమార్ గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై విజయ్ బౌన్సర్లను మందలించాడు.

మరోవైపు గాయపడిన శరత్ కుమార్ తన తల్లితో కలిసి కున్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయ్‌ను చూసేందుకు వెళ్లినప్పుడు బౌన్సర్లు తనను అడ్డుకుని కిందికి తోసివేయడంతో తల, చాతీపై గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన జరిగిన ప్రదేశం తమ పరిధిలోకి రాదని, కాబట్టి కేసును మదురై పోలీస్ స్టేషన్‌ను బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. 

విజయ్‌పై మూడు సెక్షన్ల కింద కేసు
శరత్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా కున్నం పోలీసులు టీవీకే అధినేత విజయ్, పదిమంది బౌన్సర్లపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసభ్యకరమైన భాష, దాడి, తోసివేయడం వంటి అభియోగాలు వారిపై నమోదయ్యాయి.  
Vijay Actor
Vijay TVK
Tamil Nadu Politics
Actor Vijay Case
Madurai
Bouncers Assault
Sharath Kumar
Tamiliga Vetri Kazhagam
Vijay Political Party
Kunnnam Police

More Telugu News