హైదరాబాద్ ఇన్ఫ్రా కంపెనీ కేసులో సంచలనం.. ఉన్నతస్థాయి ఒత్తిడితో విచారణ నుంచి తప్పుకున్న జడ్జి!

  • హైదరాబాద్‌కు చెందిన ఇన్ఫ్రా కంపెనీ కేసులో కీలక పరిణామం
  • ఉన్నతస్థాయి నుంచి సిఫార్సు రావడంతో విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
  • ఎన్‌క్లాట్ జ్యుడీషియల్ సభ్యుడు జస్టిస్ శరద్ కుమార్ శర్మ సంచలన నిర్ణయం
  • ఒత్తిడి విషయాన్ని రాతపూర్వక ఉత్తర్వుల్లో అధికారికంగా నమోదు చేసిన వైనం
  • కేసును మరో బెంచ్‌కు బదిలీ చేయాలని సూచన
న్యాయవ్యవస్థలో అత్యంత అరుదైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ కేసులో తీర్పు వెలువరించాల్సి ఉండగా, ఉన్నతస్థాయి నుంచి వచ్చిన సిఫారసు కారణంగా తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఓ న్యాయమూర్తి ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. చెన్నైలోని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌క్లాట్) జ్యుడీషియల్ సభ్యుడైన జస్టిస్ శరద్ కుమార్ శర్మ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

అసలేం జరిగింది?
హైదరాబాద్‌కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థపై ఏఎస్ మెట్ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో కంపెనీ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్ బెంచ్, దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతిస్తూ మధ్యంతర పరిష్కార నిపుణుడిని (ఐఆర్పీ) నియమించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సస్పెండైన డైరెక్టర్ అట్లూరు శ్రీనివాసులు రెడ్డి చెన్నై ఎన్‌క్లాట్‌ను ఆశ్రయించారు.

జస్టిస్ శరద్ కుమార్ శర్మ, టెక్నికల్ సభ్యుడు జతీంద్రనాథ్ స్వెయిన్‌తో కూడిన ధర్మాసనం ఈ అప్పీల్‌పై విచారణను పూర్తి చేసింది. ఈ నెల 13న తుది తీర్పు వెలువడాల్సి ఉంది. తీర్పు వెలువరించాల్సిన రోజున జస్టిస్ శరద్ కుమార్ శర్మ అనూహ్యంగా విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

రాతపూర్వకంగా కారణాలు వెల్లడి
ఈ కేసులో ఒక వ్యక్తికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలంటూ న్యాయవ్యవస్థలో ఉన్నత  స్థాయిలో ఉన్న అత్యంత గౌరవనీయ వ్యక్తి నుంచి తనకు సిఫారసు అందిందని జస్టిస్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ ఒత్తిడి కారణంగా మనస్తాపానికి గురయ్యానని, అందుకే కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నానని ఆయన తన అధికారిక ఉత్తర్వుల్లో రాతపూర్వకంగా పేర్కొన్నారు. ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని కూడా ఆయన సూచించారు. విచారణ సందర్భంగా జస్టిస్ శర్మ, తనకు మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఒక సందేశాన్ని కేసుతో సంబంధం ఉన్న న్యాయవాదులకు చూపించినట్లు సమాచారం. జస్టిస్ శర్మ గతంలో ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, 2023 డిసెంబరు 31న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఎన్‌క్లాట్ సభ్యుడిగా నియమితులయ్యారు.


More Telugu News