Oral Cancer: క్యాన్సర్ రోగికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స

Oral Cancer Patient Gets New Tongue Through Rare Surgery
  • క్యాన్సర్ రోగికి అరుదైన చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు
  • నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగికి నోటితో పాటు నాలుకలోని చాలా వరకు భాగాన్ని తొలగించిన వైద్యులు
  • చేతిలోని భాగాన్ని సేకరించి కొత్త నాలుకగా మార్చి అతికించిన వైద్యులు
నోటి క్యాన్సర్ కారణంగా నాలుకను కోల్పోయిన ఓ యువకుడికి వైద్యులు అరుదైన చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి పొగాకు నమిలే అలవాటు వల్ల నోటి క్యాన్సర్‌ బారిన పడ్డాడు. చికిత్స నిమిత్తం కలకత్తా వైద్య కళాశాల ఆస్పత్రిని ఆశ్రయించిన అతడికి వైద్యులు నోటితో పాటు నాలుకలోని పెద్ద భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.

ఈ పరిస్థితిలో అతడు మాట్లాడలేక, తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అయితే, అక్కడి వైద్యులు వినూత్న వైద్య విధానంతో అరుదైన శస్త్ర చికిత్స చేశారు. 'రేడియల్ ఆర్టరీ ఫోర్‌ఆర్మ్‌ ఫ్లాప్‌' అనే మైక్రోసర్జరీ పద్ధతిలో అతడి ఎడమ చేతి నుంచి మాంసాన్ని సేకరించి, దాంతో ఒక కొత్త నాలుకను తయారు చేశారు. ఆపై, సుమారు ఆరు గంటలపాటు కొనసాగిన సంక్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా దాన్ని విజయవంతంగా అతికించారు.

రోగి ప్రస్తుతం కోలుకుంటున్నాడని, రేడియోథెరపీ తీసుకుంటున్నాడని ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యుడు ప్రభీర్ యశ్ తెలిపారు. కొన్ని రోజులు వేడి ఆహారం తీసుకోలేడని చెప్పారు. అయితే, ఇప్పుడు తన నాలుకను మునుపటిలాగే కదిలించగలుగుతున్నాడని, సాధారణంగా మాట్లాడగలుగుతున్నాడని ఆయన తెలిపారు. 
Oral Cancer
Cancer
Tongue Cancer
Kolkata Medical College
West Bengal
Radial Artery Forearm Flap
Prabir Yash
Micro Surgery

More Telugu News