Hanuma Vihari: హనుమ విహారి సంచలన నిర్ణయం

Hanuma Vihari Leaves Andhra to Play for Tripura
  • ఆంధ్రా జట్టుకు వీడ్కోలు పలికిన విహారి
  • ఇకపై దేశవాళీ క్రికెట్లో త్రిపుర జట్టుకు ఆడాలని నిర్ణయం
  • త్రిపుర జట్టులో తనకు మూడు ఫార్మాట్లలో అవకాశం ఉందని వెల్లడి
టీమిండియా క్రికెటర్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఇప్పటివరకు ఆంధ్రా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన హనుమ విహారి ఇకపై త్రిపుర జట్టుకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఎంతో ఆలోచించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నానని, త్రిపుర జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ద్వారా, తనకు మూడు ఫార్మాట్లలో ఆడే అవకాశం ఉంటుందని వివరించాడు. 

ఇప్పటివరకు తన ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్రా క్రికెట్ సంఘానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని విహారి వెల్లడించాడు. అయితే, తన ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం జట్టు మార్పు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. ఈ తాజా సవాలు పట్ల ఉద్విగ్నతతో ఉన్నానని, త్రిపుర జట్టుకు తన శక్తిమేర సేవలు అందించేందుకు నిబద్ధతతో శ్రమిస్తానని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. 

31 సంవత్సరాల హనుమ విహారి టీమిండియా తరఫున 16 టెస్టులాడి 839 పరుగులు చేశాడు. అందులో 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక దేశవాళీ క్రికెట్లో ఇప్పటివరకు హైదరాబాద్, ఆంధ్రా క్రికెట్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 131 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన విహారి 49.92 సగటుతో 9,585 పరుగులు చేశాడు. అందులో 24 సెంచరీలు, 51 అర్ధసెంచరీలు ఉన్నాయి. 
Hanuma Vihari
Hanuma Vihari Tripura
Hanuma Vihari Andhra
Tripura Cricket Team
Indian Cricketer
Domestic Cricket
Ranji Trophy
Indian Test Player

More Telugu News