Kichcha Sudeep: ఫ్యాన్స్ కు కిచ్చా సుదీప్ భావోద్వేగ లేఖ

Kichcha Sudeep Emotional Letter to Fans Regarding Birthday
  • పుట్టినరోజున ఇంటి వద్దకు రావొద్దని అభిమానులను కోరిన కిచ్చా సుదీప్
  • తల్లి లేకుండా తొలి పుట్టినరోజు జరుపుకోవడం కష్టంగా ఉందంటూ ఆవేదన
  • సెప్టెంబర్ 2కు బదులుగా 1వ తేదీ రాత్రి అభిమానులను కలుస్తానన్న సుదీప్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తన పుట్టినరోజుకు సంబంధించి అభిమానులకు ఒక భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. ఏటా సెప్టెంబర్ 2న తన ఇంటి వద్దకు వచ్చి అభిమానులు చేసే వేడుకలను ఈసారికి నిలిపివేయాలని కోరారు. తన తల్లి మరణానంతరం వస్తున్న తొలి పుట్టినరోజు కావడంతో, ఆమె లేకుండా ఇంట్లో వేడుకలు జరుపుకునే స్థితిలో తాను లేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అభిమానుల కోసం ఒక ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు.

"ప్రియమైన మిత్రులారా, సెప్టెంబర్ 2న నన్ను కలవడానికి మీరు ఎంతగా ఎదురుచూస్తారో, అంతకంటే ఎక్కువగా నేను మీ కోసం వేచిచూస్తాను. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. అమ్మ లేని ఈ ఇంట్లో వేడుకలను ఊహించుకోవడమే నాకు చాలా కష్టంగా ఉంది" అని సుదీప్ తన లేఖలో పేర్కొన్నారు. అభిమానులను నిరాశపరచడం ఇష్టం లేక, వారికి ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా సూచించారు. పుట్టినరోజుకు ముందురోజైన సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి అభిమానులందరినీ ఒకచోట కలుస్తానని, ఆ ప్రదేశం వివరాలను త్వరలోనే తెలియజేస్తానని హామీ ఇచ్చారు.

అయితే, సెప్టెంబర్ 2న మాత్రం ఎవరూ తన ఇంటి వద్దకు రావొద్దని ఆయన స్పష్టంగా కోరారు. "ఆ రోజు నేను ఇంట్లో ఉండను. నేను లేనని చెప్పినా మీరు అక్కడికి వచ్చి గందరగోళం సృష్టిస్తే నా హృదయం గాయపడుతుంది. దయచేసి నా ఇంటి వద్ద ప్రశాంతతకు భంగం కలిగించవద్దు. నా మాటను గౌరవిస్తారని నమ్ముతున్నాను" అని సుదీప్ విన్నవించుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా తన పుట్టినరోజున సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. అభిమానుల శుభాకాంక్షలే తనకు గొప్ప ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సుదీప్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక సినిమాల విషయానికొస్తే, కిచ్చా సుదీప్ ప్రస్తుతం అనూప్ బండారి దర్శకత్వంలో 'బిల్లా రంగా బాషా' అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 
Kichcha Sudeep
Kichcha Sudeep birthday
Billa Ranga Baasha
Rukmini Vasanth
Kannada actor
Anoop Bhandari
Niranjan Reddy
Chaitanya Reddy
Prime Show Entertainment

More Telugu News