Chandrababu Naidu: రొటీన్ సమావేశాలు వద్దు.. ప్రజల కోసం పనిచేయండి: బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Naidu Directs Bankers to Prioritize Peoples Needs
  • బ్యాంకర్ల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి
  • సీజన్ చివర్లో రైతులకు రుణాలిస్తే ఏం ప్రయోజనమని ప్రశ్న
  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని హితవు
కేవలం సమావేశాలు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని... బ్యాంకులు తమ నిర్ణయాలను ప్రజలు, రైతులు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సచివాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో మాట్లాడుతూ, బ్యాంకర్లు తమ పనితీరును మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.

ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటికే సగం కాలం గడిచిపోయిందని, ఈ సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన బ్యాంకులు సీజన్ చివరిలో రుణాలు మంజూరు చేస్తే ప్రయోజనం ఉండదని చంద్రబాబు అన్నారు. "రైతులకు అవసరమైనప్పుడు రుణాలు, ఇతర ఇన్‌పుట్‌లు అందించాలి. కాలం దాటిపోయాక ఇచ్చే రుణాలతో వారికి ఉపయోగం శూన్యం" అని ఆయన చెప్పారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకులు కూడా కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచించాలని, నూతన సంస్కరణలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

దేశ ఆర్థిక వ్యవస్థ అమెరికా, చైనా వంటి దేశాలకు సవాలు విసిరేలా ఎదుగుతోందని, ఈ అభివృద్ధిలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కీలక పాత్ర పోషించాలన్నారు. సంపద సృష్టితో పాటు పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలను తగ్గించేందుకు కృషి చేయాలని సూచించారు. 2047 నాటికి భారత్‌ను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాలన్న లక్ష్యంలో భాగంగా బ్యాంకులు సమష్టిగా పనిచేయాలని కోరారు.

ఈ సమావేశంలో వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌కు గానూ రూ.1,80,540 కోట్ల రుణ లక్ష్యం కాగా, జూన్ నాటికి రూ.94,666 కోట్లు మంజూరు చేసినట్లు బ్యాంకర్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతులకు రూ.985 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.49,831 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ.5,937 కోట్ల రుణాలు అందించినట్లు వివరించారు. వీటితో పాటు విద్యా రంగానికి రూ.252 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.1,146 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
SLBC meeting
bank loans
farmers welfare
Kharif season
MSME loans
rural banking
economic development
agricultural loans

More Telugu News