Dasoju Shravan: కోదండరామ్ పై ప్రేమ ఉంటే సీఎం చేయండి... రేవంత్ సొల్లు పురాణం ఆపాలి: దాసోజు శ్రవణ్

Dasoju Shravan demands CM post for Kodandaram criticizes Revanth Reddy
  • కోదండరాంపై సీఎం రేవంత్ రెడ్డిది మొసలి కన్నీరు అంటూ శ్రవణ్ విమర్శలు
  • జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేయించాలని డిమాండ్
  • ఓయూకు రూ. 1000 కోట్లు ఇచ్చే దమ్ముందా అని ప్రశ్న
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రొఫెసర్ కోదండరాంపై సీఎం చూపిస్తున్నది మొసలి కన్నీరేనని, ఆయన ప్రేమలో ఏమాత్రం నిజాయతీ లేదని అన్నారు. రేవంత్ రెడ్డికి కోదండరాంపై నిజంగానే ప్రేమ ఉంటే, వెంటనే ఆయనకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని డిమాండ్ చేశారు.

సీఎం పదవికి రేవంత్ కంటే కోదండరామే అన్ని విధాలా అర్హులని శ్రవణ్ అభిప్రాయపడ్డారు. కనీసం కోదండరాంతో మంత్రిగానైనా ప్రమాణ స్వీకారం చేయించాలని, రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలని అన్నారు. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది అంతా సొల్లు పురాణమేనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే తక్షణమే ఓయూకు వెయ్యి కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సీఎం ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా కోర్టులను, న్యాయమూర్తులను అవమానిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం కోసం శ్రీకాంతాచారి, యాదయ్య వంటి వారు ఆత్మబలిదానాలు చేసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు సంకలో ఉన్నారని ఆయన విమర్శించారు.

అదేవిధంగా, రాష్ట్ర అప్పుల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అబద్ధాలు చెబుతున్నారని దాసోజు శ్రవణ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు రూ. 3,50,520 కోట్లు మాత్రమేనని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందనే భయం సీఎం రేవంత్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోందని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.
Dasoju Shravan
Revanth Reddy
Kodandaram
BRS
Telangana politics
Kaleshwaram Project
OU
Jubilee Hills by-election
Telangana debts

More Telugu News