నిందితుడు నిర్దోషిగా తేలినా బాధితులకు అప్పీలు హక్కు.. సుప్రీం సంచలన తీర్పు

  • శిక్ష తగ్గించినా, పరిహారం తక్కువ ఇచ్చినా తీర్పును సవాలు చేయొచ్చు
  • నిందితుడి హక్కులతో బాధితుల హక్కులు సమానమేనన్న సుప్రీంకోర్టు
  • బాధితులు మరణిస్తే వారి చట్టబద్ధమైన వారసులు కేసును కొనసాగించవచ్చు 
  • మరణశిక్ష కేసుల్లోనూ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కేసును రీఓపెన్ చేయొచ్చన్న సుప్రీం 
క్రిమినల్ కేసుల్లో బాధితుల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. కింది కోర్టులో నిందితుడు నిర్దోషిగా విడుదలైనా, ఆ తీర్పును సవాలు చేస్తూ అప్పీలుకు వెళ్లే హక్కు బాధితులకు ఉంటుందని స్పష్టం చేసింది. నిందితుడి హక్కులతో బాధితుల హక్కులు సమానమేనని జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఒక కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 372లోని నిబంధనల ప్రకారం మూడు సందర్భాల్లో బాధితులు అప్పీలు చేసుకోవచ్చని కోర్టు వివరించింది. నిందితుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించినప్పుడు, నేరానికి తగిన దానికంటే తక్కువ శిక్ష విధించినప్పుడు, లేదా బాధితులకు సరైన నష్టపరిహారం అందించాలని ఆదేశించనప్పుడు.. ఆ తీర్పుపై బాధితులు పై కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఈ విషయంలో బాధితుల హక్కును పరిమితం చేయలేమని స్పష్టం చేసింది.

అంతేకాకుండా, అప్పీలు విచారణలో ఉండగా బాధితుడు మరణిస్తే, వారి చట్టబద్ధమైన వారసులు ఆ కేసును కొనసాగించవచ్చని కూడా ధర్మాసనం తెలిపింది. క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి సెక్షన్ 374 ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా అప్పీలు చేసుకునే హక్కు ఎలా ఉందో, బాధితులకు కూడా అదే స్థాయిలో హక్కు ఉండాలని అభిప్రాయపడింది. ఇందుకోసమే 2009లో సీఆర్‌పీసీ సెక్షన్ 372కు సవరణలు చేశారని గుర్తుచేసింది.

మరణశిక్ష కేసుల్లోనూ ఊరట
ఇదే సమయంలో మరో కీలకమైన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. మరణశిక్ష పడిన కేసుల్లో విచారణపరమైన రక్షణ ప్రమాణాలను ఉల్లంఘించినట్లు తేలితే.. రాజ్యాంగంలోని అధికరణం 32 కింద ఆ కేసును తిరిగి తెరిచే అవకాశం ఉంటుందని తెలిపింది. మరణశిక్ష పడినంత మాత్రాన దోషి తన ప్రాథమిక హక్కులను కోల్పోడని వ్యాఖ్యానించింది. 2008లో నాగ్‌పూర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన కేసులో మరణశిక్ష పడిన వసంత్ అనే దోషి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.


More Telugu News