Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో బరువుతో పాటు జుట్టు కూడా మాయం!

Intermittent Fasting causes weight loss and hair loss
  • బరువు తగ్గేందుకు పాటిస్తున్న ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్
  • జుట్టు పెరుగుదలను మందగింపజేస్తుందన్న అధ్యయనాలు
  • ఎలుకలపై ప్రయోగాల్లో రుజువైన ఫలితాలు
  • మనుషుల్లో 18 శాతం తగ్గిన జుట్టు పెరుగుదల వేగం
  • హెయిర్ ఫాలికల్స్ పై ఒత్తిడి పెరగడమే కారణమని వెల్లడి
  • మరిన్ని పరిశోధనలు అవసరమన్న శాస్త్రవేత్తలు
బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలా మంది అనుసరిస్తున్న ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ (సాధారణంగా మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా) విధానంపై ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ తరహా ఉపవాసం వల్ల శరీర జీవక్రియలు మెరుగుపడి బరువు నియంత్రణలో ఉన్నప్పటికీ, అది జుట్టు పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

చైనాకు చెందిన వెస్ట్‌లేక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన రెండు వేర్వేరు పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైంది. రోజులో కేవలం కొన్ని గంటలు మాత్రమే ఆహారం తీసుకుని, మిగతా సమయం ఉపవాసం ఉండటం వల్ల జుట్టు పెరిగే వేగం గణనీయంగా మందగిస్తున్నట్లు వారి అధ్యయనాలు తేల్చాయి.

తమ పరిశోధనలో భాగంగా, శాస్త్రవేత్తలు కొన్ని ఎలుకల రోమాలను తొలగించి వాటిని మూడు బృందాలుగా విభజించారు. ఒక బృందానికి రోజంతా ఆహారం అందించగా, రెండో బృందానికి రోజులో కేవలం 8 గంటలు, మూడో బృందానికి రోజు విడిచి రోజు ఆహారం ఇచ్చారు. రోజంతా ఆహారం తీసుకున్న ఎలుకలకు నెల రోజుల్లోనే జుట్టు తిరిగి రాగా, ఉపవాసం ఉన్న ఎలుకలకు జుట్టు పాక్షికంగా పెరగడానికి 96 రోజులు పట్టింది. ఉపవాసం వల్ల కలిగే ఆక్సిడేటివ్ ఒత్తిడిని హెయిర్ ఫాలికల్ స్టెమ్ సెల్స్ (రోమకూప మూలకణాలు) తట్టుకోలేకపోవడమే దీనికి కారణమని వారు గుర్తించారు.

ఎలుకలతో పాటు 49 మంది ఆరోగ్యవంతులైన యువతీయువకులపై కూడా ఇదే తరహా ప్రయోగం నిర్వహించారు. వీరిలో కొందరిని రోజుకు 6 గంటలకే ఆహారం పరిమితం చేసి, 18 గంటల పాటు ఉపవాసం చేయించారు. సాధారణ ఆహారం తీసుకునే వారితో పోలిస్తే, ఉపవాసం పాటించిన వారిలో జుట్టు పెరుగుదల వేగం 18 శాతం వరకు మందగించినట్లు పరిశోధకులు కనుగొన్నారు.

అయితే, ఈ ఫలితాలను పూర్తిగా నిర్ధారించుకోవడానికి మరింత ఎక్కువ మందిపై అధ్యయనాలు చేయాల్సి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. "ఎలుకలతో పోలిస్తే మనుషుల్లో జీవక్రియల వేగం, జుట్టు పెరిగే విధానం భిన్నంగా ఉంటాయి" అని ఈ అధ్యయన బృందంలోని బింగ్ ఝాంగ్ తెలిపారు. అయినప్పటికీ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Intermittent Fasting
weight loss
hair loss
Westlake University
Bing Zhang
oxidative stress
hair follicle stem cells
metabolism
diet
research

More Telugu News