Revanth Reddy: కోదండరాంకు 15 రోజుల్లో ఎమ్మెల్సీ పదవి.. ఎవరాపుతారో చూస్తా: రేవంత్ సవాల్

Revanth Reddy Challenges KCR on Kodandaram MLC Post
  • ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
  • రూ.80 కోట్లతో నిర్మించిన నూతన హాస్టళ్ల ప్రారంభం
  • ఫాంహౌస్‌లో ఉన్నవి మానవ రూపంలోని మృగాలంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయిస్తామని హామీ
  • వచ్చే ఆరు నెలల్లో మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఏనుగులు, సింహాలు లేవని, ఫాంహౌస్‌లలో మానవ రూపంలో మృగాలు ఉన్నాయని, వాటిని పట్టుకుని బంధించాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఏఐ టెక్నాలజీతో సెంట్రల్ యూనివర్సిటీలో సింహాలు, ఏనుగులు ఉన్నట్లు తప్పుడు వీడియోలు సృష్టించి, వాటిని ప్రభుత్వం చంపుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ.80 కోట్లతో కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టల్ భవనాలను ప్రారంభించారు. దీంతో పాటు మరో రెండు హాస్టళ్లు, డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రొఫెసర్ కోదండరాంకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. "తమ ప్రభుత్వం కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తే, కొందరు పెద్ద లాయర్లను పెట్టి కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారు. కేవలం 15 రోజుల్లో ఆయనను మళ్లీ చట్టసభకు పంపిస్తాం. ఎవరు అడ్డొస్తారో చూస్తాను" అని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాంకు ఒక్క పదవి ఉండకూడదా? అని ప్రశ్నించారు.

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓయూను ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయిలో తీర్చిదిద్దడానికి రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడబోమని ప్రకటించారు. వర్సిటీ అభివృద్ధికి అవసరమైన అంచనాలు రూపొందించడానికి నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్ల నియామకంలో సామాజిక న్యాయం పాటించామని సీఎం తెలిపారు. ఓయూ 108 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఒక దళితుడిని వీసీగా నియమించామని గుర్తుచేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, చదువుతోనే తలరాతలు మారతాయని అన్నారు. రానున్న ఆరు నెలల్లో మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రైవేటు రంగంలోనూ లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు.
Revanth Reddy
Telangana
Kodandaram
MLC
Osmania University
KCR
Central University
Government Jobs
Telangana Politics
University Development

More Telugu News