Asim Munir: సైన్యం చేతిలో పాకిస్థాన్.. ప్రధాని ఓ కీలుబొమ్మే: సంచలన నివేదిక

Asim Munir controls Pakistan says European report
  • పాక్‌లో అప్రకటిత సైనిక పాలనపై సంచలన నివేదిక
  • అధికారాన్ని చేజిక్కించుకున్న ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్
  • ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ పాలన అంటూ విశ్లేషణ
  • ఎన్నికల్లో రిగ్గింగ్, చట్టసభలు పూర్తిగా నిర్వీర్యం
  • తన పదవీకాలాన్ని తానే పొడిగించుకున్న సైన్యాధిపతి
  • ప్రధాని, పార్లమెంట్ కేవలం నామమాత్రమేనని వెల్లడి
గతంలో సైనిక పాలకులు రక్తపాతం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోగా, ప్రస్తుత ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఎలాంటి ఆర్భాటం లేకుండానే దానిని సొంతం చేసుకున్నారని ఒక నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది. ఆయన ప్రజాస్వామ్య ముసుగులో ఆధునిక నియంతృత్వాన్ని పరిపూర్ణం చేశారని పేర్కొంది. పౌర ప్రభుత్వాన్ని కీలుబొమ్మగా మార్చి, దేశంలో అప్రకటిత సైనిక పాలన సాగిస్తున్నారని జియోపొలిటికల్ విశ్లేషకుడు మాటియో బియాంచి ‘యూరోపియన్ టైమ్స్’లో రాసిన కథనంలో విశ్లేషించారు.

మాటియో బియాంచి కథనం ప్రకారం, 2022 నవంబర్‌లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అసిమ్ మునీర్ వ్యూహాత్మకంగా పాకిస్థాన్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకునే లక్ష్యంతో 2024 సాధారణ ఎన్నికలను పాక్ చరిత్రలోనే అత్యంత అనుమానాస్పదంగా నిర్వహించారు. సైన్యం చెప్పినట్లు నడుచుకునే విధేయులైన రాజకీయ నాయకులను అధికారంలో కూర్చోబెట్టారు. దీంతో, దేశ పార్లమెంట్ సైనిక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసే ఒక కమిటీగా మారిపోయిందని ఆయన పేర్కొన్నారు.

అధికార పీఠంపై షరీఫ్‌లు, భుట్టో-జర్దారీ కుటుంబాలు ఉన్నప్పటికీ, వారు కేవలం సైనిక పాలనకు పౌర ముసుగు వేయడానికే పరిమితమయ్యారని బియాంచి విశ్లేషించారు. నిజమైన అధికారం మొత్తం మునీర్ చేతుల్లోనే ఉందని, దేశంలో కీలక నిర్ణయాలన్నీ సైనిక ప్రధాన కార్యాలయంలోనే తీసుకుంటారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవహారాలను సైతం పౌర ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా, నేరుగా సైన్యం నియంత్రణలో ఉండే ‘స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ కౌన్సిల్’ (ఎస్ఐఎఫ్‌సీ) ద్వారా నడిపిస్తున్నారని వివరించారు.

మునీర్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నారని ఆ నివేదిక తెలిపింది. 2025 మే నెలలో ఆయనకు ‘ఫీల్డ్ మార్షల్’ హోదా కల్పించారు. పాక్ సైన్యంలో పనిచేస్తున్న ఏ చీఫ్‌కు ఇప్పటివరకు ఈ హోదా దక్కలేదు. అంతేకాకుండా, దేశ రెండో అత్యున్నత సైనిక పురస్కారం ‘హిలాల్-ఎ-జురత్’ను కూడా ఆయనే స్వీకరించారు. ఆర్మీ చీఫ్‌కు పైఅధికారి ఎవరూ ఉండనందున, ఇది తనకు తాను ఇచ్చుకున్న బహుమతి లాంటిదని బియాంచి అభిప్రాయపడ్డారు.

ఇక 2024 నవంబర్‌లో, తన మూడేళ్ల పదవీకాలాన్ని ఐదేళ్లకు పొడిగిస్తూ పార్లమెంట్‌లో ఒక బిల్లును ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదింపజేశారు. ప్రజాస్వామ్య ముసుగును కాపాడుతూనే, ఎన్నికలు, పార్లమెంట్, న్యాయవ్యవస్థ వంటి వ్యవస్థలను లోపల డొల్లగా మార్చారని ఆ నివేదిక పేర్కొంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక దేశాధినేతగా కాకుండా, మునీర్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని మాటియో బియాంచి తన కథనంలో ముగించారు.
Asim Munir
Pakistan
Pakistan Army
Shahbaz Sharif
Imran Khan
European Times
Military rule

More Telugu News