Nara Lokesh: ఇది ఆరంభం మాత్రమే: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Says Women Empowerment Programs Just Beginning
  • మెప్మా, ర్యాపిడో భాగస్వామ్యంతో మహిళలకు స్వయం ఉపాధి
  • తొమ్మిది నగరాల్లో 1,003 మంది మహిళలకు లబ్ధి
  • మూడు నెలల్లోనే రూ.35 లక్షల ఆదాయం ఆర్జన
  • సబ్సిడీతో పాటు ఈఎంఐలలో ర్యాపిడో ప్రత్యేక మినహాయింపు
  • విజయవాడలో రోజుకు రూ.700 వరకు సంపాదిస్తున్న మహిళలు
  • రాబోయే ఏడాదిలో మరో 4,800 మందికి పథకం విస్తరణకు ప్రణాళిక
రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని, ర్యాపిడో భాగస్వామ్యంతో అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకం ఈ ప్రస్థానంలో ఒక ఆరంభం మాత్రమేనని మానవ వనరులు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందిస్తుందని, వెయ్యి మందికి పైగా మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు

ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, మెప్మా సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలు స్వయం ఉపాధి మార్గంలో దూసుకెళుతున్నారు. ‘ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త’ అనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన స్ఫూర్తితో ఈ ఏడాది మార్చి 8న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా మెప్మా, డ్వాక్రా సంఘాల ద్వారా అర్హులైన మహిళలకు బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పించి ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఆటోలను అందించారు. తొలి దశలో భాగంగా విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, గుంటూరు సహా తొమ్మిది నగరాల్లో 1,003 కుటుంబాలకు వాహనాలు అందజేశారు.

ఈ పథకంలో భాగంగా ర్యాపిడో సైతం తన వంతు సహకారం అందించింది. కొత్తగా చేరిన మహిళా డ్రైవర్లకు మూడు నుంచి నాలుగు నెలల వరకు ప్లాట్‌ఫామ్ ఫీజులో మినహాయింపు ఇవ్వడంతో పాటు, తొలి ఏడాది పాటు వారి ఈఎంఐలో నెలకు రూ.1,000 అందిస్తోంది. ప్రభుత్వం కూడా స్కూటర్‌కు రూ.12,300, ఆటోకు రూ.36,000 వరకు సబ్సిడీ ఇస్తుండటంతో మహిళలపై ఆర్థిక భారం తగ్గింది.

మూడు నెలల్లోనే అద్భుత ఫలితాలు

ఈ పథకం ద్వారా ర్యాపిడోలో చేరిన మహిళలు కేవలం మూడు నెలల కాలంలో (మే, జూన్, జూలై) 45 వేల రైడ్లు పూర్తి చేసి సుమారు రూ.35 లక్షల ఆదాయం సంపాదించారు. విజయవాడకు చెందిన గ్లోరీ మంజు, మాధవి, భవాని వంటి ఎందరో మహిళలు ఈ పథకంతో నెలకు రూ.10,000 నుంచి రూ.16,000 వరకు సంపాదిస్తూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఇంటి పనులు ముగించుకుని మిగిలిన సమయంలో పనిచేస్తూ ఆర్థిక స్వాతంత్ర్యం పొందడం ఎంతో ఆనందాన్నిస్తోందని వారు చెబుతున్నారు. ఈ విజయాలను స్ఫూర్తిగా తీసుకుని, వచ్చే ఏడాదిలో మరో 4,800 మంది మహిళలకు ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Nara Lokesh
Andhra Pradesh
Women Empowerment
Rapido
Electric Scooters
Self Employment Scheme
AP Government
Chandrababu Naidu
MEPMA
DWCRA

More Telugu News