JD Vance: భారత్ పై ట్రంప్ కఠిన చర్యలు తీసుకోవడానికి కారణం ఇదే: జేడీ వాన్స్

JD Vance Explains Trumps Stance on India Tariffs
  • భారత దిగుమతులపై 50% సుంకాలు విధించిన అమెరికా
  • రష్యాను దెబ్బతీయడానికే ఈ చర్యలన్న అమెరికా ఉపాధ్యక్షుడు
  • ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపితే తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఆహ్వానిస్తామని వ్యాఖ్య
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు మాస్కోపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి తీసుకురావడంలో భాగంగానే భారత్‌పై 50 శాతం భారీ సుంకాలను విధించామని అమెరికా స్పష్టం చేసింది. ఈ చర్య ద్వారా రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే తమ ప్రధాన లక్ష్యమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. ఈ వ్యూహాత్మక నిర్ణయంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్‌బీసీ న్యూస్ కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ మాట్లాడుతూ... "రష్యా తన చమురు ఆర్థిక వ్యవస్థ ద్వారా లాభపడకుండా కట్టడి చేసేందుకే అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై ద్వితీయ శ్రేణి సుంకాల వంటి కఠినమైన ఆర్థిక చర్యలు తీసుకున్నారు" అని వివరించారు. ఉక్రెయిన్‌లో మారణహోమాన్ని ఆపివేస్తే, రష్యాను తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఆహ్వానిస్తామని... లేకపోతే ఆ దేశం ఏకాకిగానే  కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గత కొన్ని వారాల్లో ఇరు దేశాల నుంచి సానుకూల స్పందనలు వస్తున్నాయని, రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పగలమని వాన్స్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం, భారత్ స్పందన:
రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడి చమురును కొనుగోలు చేయడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఈ నెల ప్రారంభంలో భారత ఉత్పత్తులపై సుంకాలను 50 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా 25 శాతం సుంకాన్ని ఇందులో చేర్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఆ దేశం చేస్తున్న యుద్ధానికి భారత్ ఆర్థికంగా మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపిస్తుండగా... భారత్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. కేవలం జాతీయ ప్రయోజనాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే తమ ఇంధన కొనుగోళ్లు ఉంటాయని భారత్ తేల్చి చెప్పింది.

ఈ విషయంపై శనివారం నాడు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. "వ్యాపార అనుకూల ప్రభుత్వం అని చెప్పుకునే అమెరికా, ఇతరులు వ్యాపారం చేస్తుంటే ఆరోపణలు చేయడం వింతగా ఉంది. మీకు మా నుంచి చమురు లేదా శుద్ధి చేసిన ఉత్పత్తులు కొనడంలో సమస్య ఉంటే కొనకండి. మిమ్మల్ని ఎవరూ కొనమని బలవంతం చేయడం లేదు" అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. 
JD Vance
Trump
India
Russia Ukraine war
tariffs
oil imports
economic pressure
Jaishankar
Indian foreign policy
US foreign policy

More Telugu News