DK Aruna: దమ్ముంటే దొంగ ఓట్ల లెక్క తేల్చండి: కాంగ్రెస్‌కు డీకే అరుణ సవాల్

DK Aruna challenges Congress to prove fake vote allegations
  • తెలంగాణలో దొంగ ఓట్లతోనే బీజేపీ ఎంపీల గెలిచారన్న టీపీసీసీ అధ్యక్షుడు
  • మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో వివాదం
  • అధికార మదంతో కాంగ్రెస్ నేతల అడ్డగోలు మాటలని అరుణ విమర్శ
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన 8 స్థానాలు దొంగ ఓట్ల పుణ్యమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ ఆరోపణలపై మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహేశ్ గౌడ్ వ్యాఖ్యలను ఖండించిన ఆమె... కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే దొంగ ఓట్ల వ్యవహారాన్ని తేల్చాలని సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ... "దొంగ ఓట్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. అలాంటి ఓట్లతో గెలిచే అలవాటు కాంగ్రెస్‌కే ఉంది. ఓటమి ఎదురైనప్పుడు మాత్రమే వారికి ఫేక్ ఓట్లు గుర్తుకొస్తాయి" అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాలు గెలుచుకున్నాయని, అలాంటప్పుడు దొంగ ఓట్లతో బీజేపీ మాత్రమే ఎలా గెలుస్తుందని ఆమె ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ల మధ్య నలిగిపోతున్న మహేశ్ కుమార్ గౌడ్, తీవ్ర నిరాశతో ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని ఆరోపించారు. బలహీనవర్గాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించి బీసీ నేత అయిన మహేశ్ కుమార్ గౌడ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అధికారం తలకెక్కి కాంగ్రెస్ నేతలు మతిభ్రమించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

DK Aruna
Telangana politics
BJP
Congress Party
Fake votes allegation
Mahesh Kumar Goud
Revanth Reddy
Lok Sabha elections 2024
BC reservations

More Telugu News