: పాక్‌ను ముంచెత్తుతున్న వర్షాలు.. 800కు చేరువలో మృతుల సంఖ్య

  • మృతుల్లో 200 మంది చిన్నారులు, 117 మంది మహిళలు
  • సుమారు వెయ్యి మందికి తీవ్ర గాయాలు
  • జూన్ 26 నుంచి కొనసాగుతున్న వర్ష బీభత్సం
  • ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో అత్యధికంగా 469 మరణాలు
పొరుగు దేశం పాకిస్థాన్‌లో రుతుపవన వర్షాలు పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. జూన్ 26 నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కనీసం 788 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విపత్తులో మరణించిన వారిలో 200 మంది చిన్నారులు, 117 మంది మహిళలు ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.

ఎన్‌డీఎంఏ ప్రకారం, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇక్కడ అత్యధికంగా 469 మంది మరణించారు. పంజాబ్‌లో 165 మంది, సింధ్‌లో 51, బలూచిస్థాన్‌లో 24, పాక్ ఆక్రమిత గిల్గిత్-బల్టిస్థాన్‌లో 45, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 23, రాజధాని ఇస్లామాబాద్‌లో 8 మంది చొప్పున మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన వారిలోనూ పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 584 మంది ఉండగా, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 285 మంది ఉన్నారు.

గత వారాంతంలో కురిసిన భారీ వర్షాలతో పరిస్థితి మరింత దిగజారింది. ఒక్క ఖైబర్ పఖ్తుంఖ్వాలోనే 13 మంది మరణించగా, 52 మంది గాయపడ్డారు. డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఏడుగురు బలయ్యారు. ఇళ్ల పైకప్పులు కూలిపోవడం, చెట్లు విరిగిపడటం, విద్యుత్ లైన్లు తెగిపోవడంతో అనేక ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయని సహాయక సిబ్బంది తెలిపారు.

లాహోర్, రావల్పిండి, గుజ్రాన్‌వాలా వంటి ప్రధాన నగరాల్లోనూ వరద నీరు ఇళ్లు, దుకాణాల్లోకి చేరి జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. దేశవ్యాప్తంగా సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇప్పటివరకు 512 ఆపరేషన్ల ద్వారా సుమారు 25,644 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వర్షాలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

More Telugu News