Muhammad Ashik: కేరళ లీగ్‌లో ఆఖరి బంతికి హైడ్రామా.. సిక్సర్ కొట్టి గెలిపించిన ఆషిక్

6 Needed From 1 Ball To Win Sanju Samsons Teammate Does The Unthinkable
  • కేరళ క్రికెట్ లీగ్‌లో కొచ్చి బ్లూ టైగర్స్ ఉత్కంఠ విజయం
  • చివరి బంతికి సిక్సర్ కొట్టి హీరోగా నిలిచిన ముహమ్మద్ ఆషిక్
  • కేవలం 51 బంతుల్లో 121 పరుగులతో చెలరేగిన సంజూ శాంసన్
  • 237 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన కొచ్చి జట్టు
  • వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన కొచ్చి టైగర్స్
  • 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా సంజూ శాంసన్ ఎంపిక
కేరళ క్రికెట్ లీగ్ (కేసీఎల్) 2025లో ఆదివారం జరిగిన ఓ మ్యాచ్ అభిమానులకు అసలైన టీ20 మజాను పంచింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఏరీస్ కొల్లాం సెయిలర్స్‌పై కొచ్చి బ్లూ టైగర్స్ నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. భారత స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ (121) ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో గెలుపునకు బలమైన పునాది వేయగా, చివరి బంతికి సిక్సర్ బాదిన ముహమ్మద్ ఆషిక్ కొచ్చి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కొల్లాం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోరు సాధించింది. విష్ణు వినోద్ (94), కెప్టెన్ సచిన్ బేబీ (91) పరుగులతో కొచ్చి బౌలర్లను ఊచకోత కోశారు. అనంతరం 237 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కొచ్చి జట్టుకు సంజూ శాంసన్ అండగా నిలిచాడు. కేవలం 51 బంతుల్లోనే 121 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు.

అయితే, శాంసన్ ఔటయ్యాక మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో కొచ్చి విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ఉన్న ముహమ్మద్ ఆషిక్.. షరీఫుద్దీన్ వేసిన తొలి రెండు బంతులను ఫోర్, సిక్సర్‌గా మలిచాడు. మూడో బంతికి సింగిల్ తీయగా, నాలుగో బంతికి అల్ఫీ ఫ్రాన్సిస్ జాన్ రనౌట్ అయ్యాడు. ఐదో బంతికి పరుగులేమీ రాలేదు. దీంతో చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సిన ఉత్కంఠభరితమైన పరిస్థితి ఏర్పడింది. ఈ కీలక సమయంలో ఆషిక్ ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా భారీ సిక్సర్ బాదడంతో కొచ్చి శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి.

ఈ విజయంతో కొచ్చి జట్టు టోర్నీలో వరుసగా మూడో గెలుపును నమోదు చేసింది. అద్భుతమైన సెంచరీ సాధించిన సంజూ శాంసన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. కాగా, సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌కు ఎంపికైన భారత జట్టులో శాంసన్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రదర్శన అతని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.
Muhammad Ashik
Sanju Samson
Kerala Cricket League
KCL 2025
Kochi Blue Tigers
Aries Kollam Sailors
Vishnu Vinod
Sachin Baby
cricket match
T20 cricket

More Telugu News