శంషాబాద్ నుంచి తిరుపతి, ఢిల్లీ వెళ్లే విమానాల్లో సాంకేతిక సమస్యలు.. ఆగిపోయిన విమానాలు

  • శంషాబాద్ విమానాశ్రయంలో ఒకే రోజు రెండు ఘటనలు 
  • తిరుపతి వెళ్లే విమానంలో ఇంజిన్ సమస్య
  • ఢిల్లీ వెళ్లే విమానంలో ఫైర్ ఎగ్జాస్టింగ్ వ్యవస్థలో లోపం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ప్రయాణికులకు ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి. వేర్వేరు గమ్యస్థానాలకు వెళ్లాల్సిన రెండు విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో అధికారులు ఆ సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

వివరాల్లోకి వెళితే, ఉదయం 7.15 గంటలకు అలయన్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9ఐ-877 విమానం 50 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరేందుకు సిద్ధమైంది. టేకాఫ్ కోసం రన్‌వే పైకి వెళ్లిన సమయంలో విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఉన్నట్టు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు ఆ విమాన సర్వీసును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు వెనుదిరగాల్సి వచ్చింది.

ఇదే తరహాలో, ఢిల్లీకి వెళ్లాల్సిన ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన క్యూపీ-1405 విమాన సర్వీసు కూడా రద్దయింది. ఈ తెల్లవారుజామున 200 మంది ప్రయాణికులతో ఈ విమానం పార్కింగ్ బే నుంచి ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ వైపు వస్తుండగా, దాని ఫైర్ ఎగ్జాస్టింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. బోర్డింగ్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు ఈ విషయాన్ని తెలిపిన అధికారులు, టికెట్ డబ్బులు వాపసు ఇస్తామని లేదా ప్రత్యామ్నాయ విమానంలో పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రయాణికులు శాంతించారు.


More Telugu News