Rekha Gupta: ఢిల్లీ సీఎంపై దాడి కేసు: కత్తితో దాడికి ప్లాన్ చేసిన నిందితుడు!

Accused Planned To Attack Delhi Chief Minister With Knife
  • ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి కేసులో సంచలన విషయాలు
  • తొలుత కత్తితో దాడి చేయాలని నిందితుడు రాజేశ్ సక్రియా ప్లాన్
  • భద్రతను చూసి కత్తి పడేసి, చేయి చేసుకున్న వైనం
  • కేసులో మరో నిందితుడు తహసీన్ సయ్యద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • నిందితుడికి ఆర్థిక సాయం అందించి, నిరంతరం టచ్‌లో ఉన్న స్నేహితుడు
  • వీధికుక్కల తరలింపుపై కోపంతోనే దాడికి పాల్పడినట్లు వెల్లడి
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై గత వారం జరిగిన దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాజేశ్ సక్రియా తొలుత ఆమెపై కత్తితో దాడి చేయాలని ప్లాన్‌ వేసినట్లు పోలీసు వర్గాలు సోమవారం వెల్లడించాయి. పటిష్ఠమైన భద్రత కారణంగా తన ప్లాన్‌ను చివరి నిమిషంలో మార్చుకుని, ఆమెపై చేయి చేసుకున్నట్లు విచారణలో తేలింది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో వీధి కుక్కలను నివాస ప్రాంతాల నుంచి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై తాను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సీఎం రేఖా గుప్తా పట్టించుకోలేదని నిందితుడు రాజేశ్ సక్రియా ఆరోపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అతడు, ఆగస్టు 20న ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 41 ఏళ్ల సక్రియా, ముందుగా సుప్రీంకోర్టు వద్దకు వెళ్లినా అక్కడ భద్రత ఎక్కువగా ఉండటంతో వెనుదిరిగాడు.

ఆ తర్వాత సీఎం కార్యాలయంలో జరిగే 'జన్‌ సున్‌వాయీ' (ప్రజా దర్బార్) కార్యక్రమానికి కత్తితో హాజరయ్యాడు. అయితే, అక్కడ కూడా భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో కత్తిని బయట పడేసి లోపలికి వెళ్లాడు. అనంతరం సీఎం రేఖా గుప్తా చెంపపై కొట్టి, ఆమెను తోసేసి, జుట్టు పట్టుకుని లాగినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. సక్రియా స్నేహితుడైన తహసీన్ సయ్యద్‌ను గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. దాడికి ముందు సక్రియాకు తహసీన్ డబ్బు పంపాడని, ఇద్దరూ నిరంతరం ఫోన్‌లో మాట్లాడుకున్నారని తేలింది. అంతేకాకుండా సక్రియా సీఎం నివాసం వీడియోను కూడా తహసీన్‌కు పంపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు రాజేశ్ సక్రియాపై గుజరాత్‌లో మద్యం అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసులు ఉన్నట్లు సమాచారం.

కాగా, వీధికుక్కల సమస్య ఢిల్లీలో తీవ్రంగా ఉందని, దీనికి సరైన పరిష్కారం కనుగొంటామని సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రేఖా గుప్తా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Rekha Gupta
Delhi CM
Delhi Mayor
Rajesh Sakaria
Tahseen Sayyed
Delhi
Supreme Court
Street Dogs
Jan Sunwai
Attack

More Telugu News