Suravaram Sudhakar Reddy: ముగిసిన సురవరం అంతిమయాత్ర... భౌతికకాయం గాంధీ ఆసుపత్రికి అప్పగింత

Suravaram Sudhakar Reddy Funeral Concludes Body Donated to Gandhi Hospital
  • సీపీఐ సీనియర్ నేత సురవరంకు కన్నీటి వీడ్కోలు 
  • అధికార లాంఛనాలతో అంతిమయాత్ర  
  • ఎర్ర జెండాలతో పాల్గొన్న సీపీఐ కార్యకర్తలు
  • గన్ సెల్యూట్ సమర్పించిన పోలీసులు 
ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ఆదివారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిసింది. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు, వేలాది మంది కార్యకర్తలు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు గాంధీ మెడికల్ కాలేజీకి దానం చేసి ఆదర్శంగా నిలిచారు.

హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్ నుంచి సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. పోలీసు బ్యాండ్ వాయిద్యాల నడుమ సాగిన ఈ యాత్రలో పార్టీ కార్యకర్తలు ఎర్ర జెండాలతో పాల్గొన్నారు. 'కామ్రేడ్ సుధాకర్ రెడ్డి అమర్ రహే' అంటూ నినాదాలు చేశారు. పూలతో అలంకరించిన వాహనంపై ఉంచిన ఆయన పార్థివదేహానికి 'లాల్ సలాం' చెబుతూ నివాళులర్పించారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వద్దకు యాత్ర చేరుకున్న తర్వాత, పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గన్ సెల్యూట్ సమర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి గౌరవ వందనం సమర్పించారు. కుటుంబ సభ్యులు సురవరం భౌతికకాయాన్ని గాంధీ ఆసుపత్రి వర్గాలకు అప్పగించారు. 

అంతకుముందు, మఖ్దూం భవన్‌లో ఉంచిన సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ, ఎమ్మెల్సీ కోదండరామ్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ వంటి అనేక మంది నేతలు ఆయనకు తుది నివాళులర్పించారు.

83 ఏళ్ల సుధాకర్ రెడ్డి వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన, 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. కార్మిక వర్గం, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నేతగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. సుధాకర్ రెడ్డి కుటుంబం ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేసింది.
Suravaram Sudhakar Reddy
CPI
Communist leader
Telangana
Gandhi Hospital
Final rites
Revanth Reddy
Chandrababu Naidu
KTR
Venkaiah Naidu

More Telugu News