గంగూలీ సరికొత్త అవతారం... దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో కీలక బాధ్యతలు

  • ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ నియామకం
  • కెరీర్‌లో తొలిసారి పూర్తిస్థాయి హెడ్ కోచ్‌గా బాధ్యతలు
  • దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో గంగూలీకి కీలక పదవి
  • జొనాథన్ ట్రాట్ స్థానంలో ఎంపికైన భారత మాజీ కెప్టెన్
  • సెప్టెంబర్ 9న జరిగే ఆటగాళ్ల వేలంపై దాదా తొలి ఫోకస్
  • గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా అనుభవం
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన కెరీర్‌లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తొలిసారిగా ఆయన ఓ ప్రొఫెషనల్ క్రికెట్ జట్టుకు పూర్తిస్థాయి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 2026 సీజన్ కోసం ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి గంగూలీని హెడ్ కోచ్‌గా నియమించినట్లు ఆ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

"యువరాజు మా క్యాంప్‌కు రాజసం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు! సౌరవ్ గంగూలీని మా కొత్త హెడ్ కోచ్‌గా ప్రకటించడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం" అని ప్రిటోరియా క్యాపిటల్స్ ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పేర్కొంది. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత గంగూలీ ఎక్కువగా పరిపాలనాపరమైన పాత్రల్లోనే కనిపించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ప్రస్తుతం ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా, గతంలో మెంటార్‌గా వ్యవహరించినప్పటికీ, హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడం ఇదే మొదటిసారి.

ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జొనాథన్ ట్రాట్ స్థానంలో గంగూలీ ఈ బాధ్యతలు చేపట్టారు. ట్రాట్ కోచింగ్‌లో 2025 సీజన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 10 గ్రూప్ మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి నాకౌట్ దశకు చేరుకోలేకపోయింది. దీంతో ట్రాట్ ఆ పదవి నుంచి తప్పుకున్న మరుసటి రోజే గంగూలీ నియామకాన్ని ప్రకటించడం గమనార్హం.

హెడ్ కోచ్‌గా గంగూలీ ముందున్న తక్షణ కర్తవ్యం సెప్టెంబర్ 9న జరిగే ఆటగాళ్ల వేలంలో జట్టుకు ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేయడం. కాగా, 2026 పురుషుల టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో దక్షిణాఫ్రికా లీగ్‌ను ముందుకు జరిపారు. ఈ టోర్నీ డిసెంబర్ 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 25 వరకు జరగనుంది.


More Telugu News