నయాగరా టూర్ విషాదం.. బస్సు బోల్తాపడి ఇద్దరు భారత సంతతి వ్యక్తుల దుర్మరణం

  • అమెరికాలో పర్యటక బస్సు బోల్తాపడి ఘోర ప్రమాదం
  • నయాగరా జలపాతం నుంచి తిరిగి వస్తుండగా ఘటన
  • ప్రమాదంలో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు సహా ఐదుగురి మృతి
  • ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు
  • ఘటనపై అమెరికా పోలీసుల‌ దర్యాప్తు
అమెరికాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు మృతి చెందారు. నయాగరా జలపాతాన్ని సందర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్టేట్ పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు.

శనివారం పోలీసులు విడుదల చేసిన వివరాల ప్రకారం, మృతులను బీహార్‌లోని మధుబనికి చెందిన శంకర్ కుమార్ ఝా (65), న్యూజెర్సీలోని ఈస్ట్ బ్రన్స్‌విక్‌లో నివసిస్తున్న పింకీ చంగ్రాని (60)గా గుర్తించారు. మిగిలిన ముగ్గురు మృతులు చైనాకు చెందినవారని తెలిపారు.

శుక్రవారం మధ్యాహ్నం 54 మంది ప్రయాణికులతో న్యూయార్క్ నగరానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నయాగరా జలపాతానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో హైవేపై ప్రయాణిస్తుండగా, డ్రైవర్ అకస్మాత్తుగా బస్సుపై నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు రోడ్డు డివైడర్‌ను ఢీకొని, పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న కందకంలోకి దూసుకెళ్లింది.

ప్రమాద సమయంలో బస్సులో భారత్, చైనా, ఫిలిప్పీన్స్, అమెరికాకు చెందిన పర్యాటకులు ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను హెలికాప్టర్ అంబులెన్సుల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా, మరికొందరు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని అధికారులు చెప్పారు.

ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ సహకారంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం సేవించిన ఆనవాళ్లు లేవని, బస్సులో ఎలాంటి సాంకేతిక లోపాలు కనబడలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్ పరధ్యానం వల్లే బస్సు అదుపుతప్పి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్ తరహాలో పనిచేసే ఈవెంట్ రికార్డింగ్ డివైస్ బస్సులో ఉందని, దానిని పరిశీలిస్తే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.




More Telugu News