Chandrababu Naidu: మొహమాటాలకు పోయి డమ్మీలు, వీక్ గా ఉండే వాళ్లను పెడితే ప్రభుత్వం, పార్టీ నష్టపోతాయి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Warns Against Weak Leaders in Parliament Committees
  • పార్లమెంట్ కమిటీల కూర్పుపై టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం
  • వైసీపీ ఒక విష వృక్షం అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
  • తప్పుడు ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు
  • కమిటీల్లో బలమైన నేతలకే అవకాశం ఇవ్వాలని, డమ్మీలకు చోటివ్వొద్దని స్పష్టం
  • ప్రభుత్వ మంచి పనులపై చర్చ జరగకుండా వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపణ
"పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల నియామకం అత్యంత పాదర్శకంగా, పకడ్బందీగా జరగాలి. కమిటీ నియామకంలో సోషల్ రీఇంజనీరింగ్ జరగాలి. అన్ని వర్గాలకు, బలమైన నేతలకు అవకాశం ఇవ్వాలి. మొహమాటాలకు పోయి డమ్మీలను, బలహీనమైన వారిని పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల్లో పెడితే పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుంది" అని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను గట్టిగా హెచ్చరించారు. పార్లమెంట్ కమిటీల నియామకం అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా జరగాలని, చురుగ్గా పనిచేసే బలమైన నేతలకే అవకాశాలు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల కూర్పుపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి 75 మంది ముఖ్య నేతలు, పార్లమెంట్ కమిటీల ఏర్పాటు కోసం నియమించిన త్రిసభ్య కమిటీల సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కమిటీల నియామకంలో సామాజిక సమీకరణాలు (సోషల్ రీఇంజనీరింగ్) కచ్చితంగా పాటించాలని, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నామన్న భావనతో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

గత ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిందని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తాము సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామని చంద్రబాబు తెలిపారు. "సూపర్ సిక్స్ అని చెప్పాం.. చెప్పినట్టే అన్ని పథకాలను అమలు చేస్తూ సూపర్ హిట్ చేశాం. ఏడాది కాలంలోనే మ్యానిఫెస్టోలోని అనేక హామీలు నెరవేర్చడంతో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది" అని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సమయంలో వైసీపీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రతిపక్షం కాదని, అదొక విష వృక్షం అని అభివర్ణించారు. "తప్పుడు ప్రచారాలనే రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుని వారు రోజువారీ రాజకీయం చేస్తున్నారు. అమరావతి మునిగిపోయిందని, ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయాయని ఫేక్ ప్రచారాలు చేశారు. చివరికి సింగయ్యను చంపేసి ఆ నేరాన్ని కూడా ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నించారు. వాళ్లే నేరం చేసి, వాళ్లే వివాదం సృష్టించి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం వారికి అలవాటుగా మారింది" అని మండిపడ్డారు.

లక్షల పింఛన్లు తొలగించామని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ మంచి పనులపై చర్చ జరగకుండా చేసేందుకే వైసీపీ కుట్రలు చేస్తోందని, వాస్తవాలను ఉదాహరణలతో ప్రజలకు వివరిస్తూనే ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాల విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 6వ తేదీన అనంతపురంలో 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' పేరిట భారీ కార్యక్రమం నిర్వహిద్దామని తెలిపారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించానని, కింది స్థాయి నుంచి పై వరకు బలమైన వ్యవస్థను నిర్మిస్తున్నానని చంద్రబాబు వివరించారు.

"పార్టీపై ఫోకస్ పెట్టి బలోపేతం చేసుకోవాలి... తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంటుంది. అనేక సవాళ్లను మనం ఎదుర్కొన్నాం. అనేక పోరాటాలు చేశాం. ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాం. పార్టీని రీ ఆర్గనైజ్ చేశాం... రీ స్ట్రక్చర్ చేశాం... యువతకు అవకాశాలు ఇస్తున్నాం. తెలుగుదేశం సిద్దాంతం చాలా బలమైనది.. చాలా విశిష్టమైనది. అందుకే ఇన్నేళ్లుగా ప్రజల ఆదరణ పొందుతోంది.. సంస్థాగతంగా బలమైన, అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ మన తెలుగుదేశం. పార్టీలో ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా ఉండాలి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ నేతలు మరింత బాధ్యతగా ఉండాలి. ఎన్నో పోరాటాలు చేసి నేడు మనం ఇక్కడికి వచ్చాం. గత 5 ఏళ్లు అనేక సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డాం అనేది మరిచిపోకూడదు. పార్టీ ఇమేజ్ ను, ప్రభుత్వ ఇమేజ్ ను పెంచేలా నేతల తీరు ఉండాలి" అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 

Chandrababu Naidu
TDP
Telugu Desam Party
Andhra Pradesh Politics
Parliament Committees
Social Reengineering
YCP Allegations
Super Six Schemes
Anantapur Event
AP Government

More Telugu News