Sam Altman: హైదరాబాద్ వచ్చేయండి.. ఓపెన్ ఏఐ సీఈఓకు కేటీఆర్ ఆహ్వానం

Hyderabad Ideal for OpenAI India Operations Says KTR to Sam Altman
  • వచ్చే నెల భారత్ కు వస్తున్న ఓపెన్ ఏఐ సీఈవో
  • ఓపెన్ ఏఐకి హైదరాబాద్ సరైన ప్రవేశ ద్వారమన్న కేటీఆర్
  • భారత్ లో తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విన్నపం
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టిస్తున్న చాట్‌జీపీటీ మాతృసంస్థ ‘ఓపెన్ ఏఐ’ భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రతిపాదన చేశారు. భారత్‌లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌కు ఆయన బహిరంగంగా విజ్ఞప్తి చేశారు.

వచ్చే నెలలో శామ్ ఆల్ట్‌మన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా, భారత్‌లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం అద్భుతంగా ఉందని, గత ఏడాదితో పోలిస్తే చాట్‌జీపీటీ వాడకం నాలుగు రెట్లు పెరిగిందని ఆల్ట్‌మన్ ఇటీవల ‘ఎక్స్’ వేదికగా ప్రశంసించారు. ఆయన పోస్ట్‌కు స్పందించిన కేటీఆర్, హైదరాబాద్‌కు రావాల్సిందిగా ఆల్ట్‌మన్‌ను ఆహ్వానించారు.

భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్న ఓపెన్ ఏఐ వంటి సంస్థలకు హైదరాబాద్ సరైన ప్రవేశ ద్వారమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ హైదరాబాద్‌లో ఉందని ఆయన నొక్కి చెప్పారు. టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) వంటి అగ్రశ్రేణి సంస్థలను ప్రస్తావిస్తూ, ఈ వాతావరణం ఓపెన్ ఏఐ కార్యకలాపాలకు ఎంతగానో దోహదపడుతుందని వివరించారు.

ఈ ఏడాది చివర్లోగా భారత్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఓపెన్ ఏఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేటీఆర్ ఆహ్వానం నేపథ్యంలో, సంస్థ తన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.
Sam Altman
OpenAI
KTR
Hyderabad
India
Artificial Intelligence
ChatGPT
Innovation Ecosystem
T-Hub
Tech Industry

More Telugu News