Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి అవకాశమివ్వాలి: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar urges support for ruling party in Jubilee Hills election
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలన్న మంత్రి
  • జూబ్లీహిల్స్‌లో 6 వేల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్న మంత్రి
  • పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పథకాలను పూర్తి చేయాలని సూచన
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి అవకాశం ఇస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాభవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.

నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్‌లో 6 వేల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. ప్రతి బూత్‌కు ఒకరు ఇంఛార్జ్‌గా ఉండాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఎక్కడా ఉండకూడదని ఆదేశించారు.

నియోజకవర్గంలోని 7 డివిజన్లలో ఇంఛార్జ్ ఉపాధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్‌లు ప్రభావవంతంగా పనిచేయాలని సూచించారు. డివిజన్లలో కార్యాలయాలు ప్రారంభించాలని అన్నారు. బూత్ వారీగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెండింగ్‌లో ఉన్న ఇతర ప్రభుత్వ పథకాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
Ponnam Prabhakar
Jubilee Hills
Telangana Elections
Congress Party
Assembly Elections
Free Electricity

More Telugu News