Donald Trump: పుతిన్ తీరుపై ట్రంప్ అసహనం

Donald Trump Displeased with Putins Actions in Ukraine
  • రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడి ప్రయత్నం
  • చర్చల కోసం ఇటీవలే పుతిని, జెలెన్ స్కీలతో విడివిడిగా భేటీ
  • త్రైపాక్షిక సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్న ట్రంప్
  • ఇంతలోనే ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్.. ట్రంప్ ఆగ్రహం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు తాను శాంతి చర్చలు జరుపుతుంటే సహకరిస్తానని చెబుతూనే, మరోపక్క ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాడని మండిపడ్డారు. ఉక్రెయిన్‌లోని అమెరికాకు చెందిన ఫ్యాక్టరీపై రష్యా డ్రోన్ దాడులు చేయడంపై సీరియస్ గా స్పందించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే భారీ ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. 

మూడేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఇటీవల రంగంలోకి దిగారు. తొలుత పుతిన్ తో, అనంతరం జెలెన్ స్కీతో భేటీ అయ్యారు. యుద్ధాన్ని ఆపేయాలని ఇరువురు నేతలకూ నచ్చజెప్పారు. శాంతి చర్చల కోసం పుతిన్, జెలెన్ స్కీ, ట్రంప్ ల మధ్య త్రైపాక్షిక భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ట్రంప్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆయా సమావేశాల తర్వాత పుతిన్, జెలెన్ స్కీలు కూడా శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. యుద్ధం ఆపేయాలనే ఆకాంక్షను వెలిబుచ్చడంతో పాటు ట్రంప్ కృషిని కీర్తించారు. అయితే, పుతిన్ మరోమారు ఉక్రెయిన్ భూభాగంపై డ్రోన్ దాడి చేశారు. ఏకంగా 5 వందలకు పైగా డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు వారాల్లో యుద్ధం ఆపేయాలని పుతిన్, జెలెన్ స్కీలను మరోమారు హెచ్చరించారు.

రెండు వారాల తర్వాత కూడా ఇలాగే దాడులు జరుపుకుంటే ఇరు దేశాలపై ఆంక్షలు, భారీ సుంకాలు విధిస్తానని స్పష్టం చేశారు. కాగా, పుతిన్, జెలెన్ స్కీలతో సమావేశం ఏర్పాటు చేయడం ఆయిల్ ను, వెనిగర్‌ ను కలపడం లాంటిదని ట్రంప్ పేర్కొన్నారు. భవిష్యత్తులో వారి మధ్య జరగబోయే చర్చల్లో తాను పాల్గొంటానో లేదోనని ట్రంప్ సందేహం వ్యక్తం చేశారు.
Donald Trump
Vladimir Putin
Russia Ukraine war
Ukraine
Zelensky
peace talks
US factory
drone attack
sanctions
tariffs

More Telugu News