Online Payment: కాపురం కూల్చిన ఆన్ లైన్ పేమెంట్.. చైనాలో వింత ఘటన

China Online Payment Exposes Cheating Husband
  • ప్రియురాలి కోసం గర్భనిరోధక మాత్రలు కొన్న చైనా యువకుడు
  • ఆన్ లైన్ పేమెంట్ ఫెయిల్ కావడంతో ఫోన్ చేసిన మెడికల్ షాప్ సిబ్బంది
  • యువకుడి భార్య ఫోన్ ఎత్తడంతో బయటపడ్డ బండారం
చైనాలో ఓ యువకుడు చేసిన ఆన్ లైన్ పేమెంట్ అతడి అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది. గుట్టుగా సాగిస్తున్న 'చిన్నిల్లు' వ్యవహారం భార్యకు తెలిసిపోయేలా చేసింది. దీంతో భర్తపై ఆగ్రహించిన భార్య.. విడాకుల కోసం కోర్టుకెక్కింది. అటు ప్రియురాలి భర్త కూడా విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. రూ.200 ల కోసం ఓ మెడికల్ షాప్ సిబ్బంది చేసిన ఫోన్ కాల్ రెండు కుటుంబాలను విడదీసింది.

అసలు ఏంజరిగిందంటే..
గువాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని యాంగ్జియాంగ్ కు చెందిన ఓ యువకుడు తన ప్రియురాలి కోసం స్థానిక మందుల దుకాణంలో గర్భనిరోధక మాత్రలు కొనుగోలు చేశాడు. ఈ మాత్రలకు 15.8 యువాన్ల (సుమారు రూ.200) ను తన కార్డుతో చెల్లించి వెళ్లిపోయాడు. అయితే, సాంకేతిక కారణాలతో ఆ పేమెంట్ ఫెయిలైంది. దీంతో మందుల దుకాణం సిబ్బంది ఆ కార్డుతో లింక్ ఉన్న మొబైల్ నెంబర్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ యువకుడి దురదృష్టం కొద్దీ సదరు ఫోన్ కాల్ ఆయన భార్య అందుకుంది.

తన భర్త ఏం కొన్నాడు, ఎందుకు పేమెంట్ ఫెయిలైందని ఆరా తీయగా గర్భనిరోధక మాత్రలని సిబ్బంది బదులిచ్చారు. తనకు గర్భనిరోధక మాత్రలు అవసరమే లేనప్పుడు.. భర్త ఎవరి కోసం ఆ మాత్రలు కొన్నాడని ఆరా తీసింది. దీంతో భర్త గారి చిన్నిల్లు వ్యవహారం బయటపడింది. భర్తను చెడామడా తిట్టేసి విడాకులు కావాలంటూ ఆమె కోర్టుకెక్కింది. దీంతో ఈ విషయం మీడియాకు తద్వారా ఆ యువకుడి ప్రియురాలి భర్తకూ చేరింది. ఆ కుటుంబంలోనూ చిచ్చు రేపింది.

ఆ ప్రియురాలి భర్త కూడా విడాకుల కోసం కోర్టుకెక్కాడు. మందుల దుకాణం కారణంగా తన కుటుంబం విచ్ఛిన్నమైందని ఆ యువకుడు న్యాయపోరాటం చేయాలని భావిస్తున్నాడట. అయితే, స్థానిక చట్టాల ప్రకారం ఆ యువకుడికి ఎలాంటి ప్రయోజనం ఉండదనే లాయర్లు చెబుతున్నారు.
Online Payment
China Adultery
Infidelity
Divorce China
Contraceptive Pills
Guangdong Province
Yangjiang
Extramarital Affair

More Telugu News