Naukri: దేశంలో మళ్లీ ఉద్యోగాల జోరు.. భారీగా నియామకాలకు సిద్ధమవుతున్న కంపెనీలు!

India Job Market Set for Growth Naukri Survey
  • ద్వితీయార్థంలో ఊపందుకోనున్న ఉద్యోగ మార్కెట్
  • కొత్త నియామకాలకు 72 శాతం కంపెనీలు సుముఖం
  • నౌకరీ ద్వైవార్షిక సర్వేలో కీలక విషయాల వెల్లడి
  • ఏఐ, మెషీన్ లెర్నింగ్ నిపుణులకు భారీ డిమాండ్
  • 4 నుంచి 7 ఏళ్ల అనుభవం ఉన్నవారికే ఎక్కువ అవకాశాలు
  • కొలువులపై ఏఐ ప్రభావం ఉండదంటున్న 87 శాతం యాజమాన్యాలు
దేశంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో (రాబోయే ఆరు నెలల్లో) నియామకాల ప్రక్రియ ఊపందుకోనుంది. దేశంలోని అత్యధిక కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రముఖ జాబ్ పోర్టల్ 'నౌకరీ' నిర్వహించిన ద్వైవార్షిక సర్వేలో ఈ సానుకూల ధోరణి స్పష్టంగా కనిపించింది.

దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 1,300 కంపెనీల యాజమాన్య ప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 72 శాతం మంది కొత్త నియామకాల ద్వారా తమ సిబ్బందిని విస్తరించుకోవాలని యోచిస్తున్నట్టు తెలిపారు. రాబోయే నెలల్లో నియామకాలు చేపట్టే ఆలోచనలో ఉన్నామని సర్వేలో పాల్గొన్న వారిలో 94 శాతం మంది స్పష్టం చేయడం ఉద్యోగ మార్కెట్‌లోని సానుకూల వాతావరణానికి అద్దం పడుతోంది. "నికరంగా అదనపు సిబ్బందిని చేర్చుకోవాలని 72 శాతం కంపెనీలు భావించడం ఎంతో ప్రోత్సాహకరమైన అంశం" అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయెల్ అన్నారు.

ఏఐతో ఉద్యోగాలకు ఢోకా లేదు
కృత్రిమ మేధ (ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలు విస్తృతంగా ఉన్నప్పటికీ, కంపెనీల యాజమాన్యాలు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 87 శాతం మంది, ఏఐ వల్ల ఉద్యోగ మార్కెట్‌పై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, 13 శాతం మంది ఏఐని ఉద్యోగాల సృష్టికి చోదకశక్తిగా అభివర్ణించారు. ముఖ్యంగా ఐటీ (42 శాతం), అనలిటిక్స్ (17 శాతం), బిజినెస్ డెవలప్‌మెంట్ (11 శాతం) వంటి రంగాలకు ఏఐ వల్ల మేలు జరుగుతుందని అంచనా వేశారు.

ఈ స్కిల్స్‌కే ఎక్కువ డిమాండ్
సంప్రదాయ టెక్నాలజీల కంటే మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఏఐ ఆధారిత నైపుణ్యాలు ఉన్నవారికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సర్వే తేల్చింది. నియామకాల్లో ఐటీ విభాగానికి 37 శాతం కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అనుభవం విషయానికొస్తే, 4 నుంచి 7 సంవత్సరాల మధ్య అనుభవం ఉన్న నిపుణులకు అత్యధిక డిమాండ్ ఉన్నట్టు వెల్లడైంది. దాదాపు 47శాతం కంపెనీలు ఈ కేటగిరీ ఉద్యోగుల కోసం చూస్తుండగా, మూడేళ్ల లోపు అనుభవం ఉన్నవారికి (ఎంట్రీ లెవల్) 29 శాతం అవకాశాలు ఉన్నాయి.
Naukri
India jobs
job market
hiring trends
AI impact
artificial intelligence
IT jobs
data science
machine learning
employment

More Telugu News