సీఎంలపై క్రిమినల్ కేసులు.. 89 కేసులతో రేవంత్ రెడ్డి టాప్!

  • దేశంలోని 30 మంది సీఎంలలో 12 మందిపై క్రిమినల్ కేసులు
  • ఏపీ సీఎం చంద్రబాబుపై 19 కేసులు 
  • తమిళనాడు సీఎం స్టాలిన్‌పై 47 కేసులు
  • 10 మంది సీఎంలపై హత్యాయత్నం వంటి తీవ్రమైన ఆరోపణలు
  • ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా వివరాలు సేకరించిన ఏడీఆర్
దేశ రాజకీయాల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో ఏకంగా 12 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్వయంగా ప్రకటించారు. ఈ సంచలన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 89 కేసులతో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.

ఏడీఆర్ నివేదిక ప్రకారం రేవంత్ రెడ్డి తర్వాత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌పై 47 కేసులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై 19 కేసులు ఉన్నాయని వారి అఫిడవిట్లలో పేర్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై 13, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌పై 5, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్‌ లపై 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. కేరళ సీఎం పినరయి విజయన్‌పై 2, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ఒక క్రిమినల్ కేసు ఉన్నట్టు ఏడీఆర్ స్పష్టం చేసింది.

కేవలం కేసుల సంఖ్యే కాకుండా వాటి తీవ్రత కూడా ఆందోళన కలిగించే అంశం. ఈ జాబితాలోని కనీసం 10 మంది ముఖ్యమంత్రులపై హత్యాయత్నం, కిడ్నాపింగ్, అవినీతి వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని కూడా ఏడీఆర్ తన నివేదికలో తెలిపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నివేదికకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఐదేళ్ల కంటే ఎక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టై 30 రోజులు జైల్లో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేలా కేంద్ర ప్రభుత్వం ఓ బిల్లును తీసుకువస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు చర్చనీయాంశంగా మారాయి. కాగా, ఆయా ముఖ్యమంత్రులు తమ ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ఆధారంగానే తాము ఈ నివేదికను రూపొందించినట్టు ఏడీఆర్ స్పష్టం చేసింది.


More Telugu News