: పోలీసు అధికారులకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్

  • పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి బానిసలుగా మారారన్న మర్రి జనార్దన్ రెడ్డి
  • కార్యకర్తలను ఇబ్బంది పెట్టే అధికారుల పేర్లు రాసి పెట్టుకుంటున్నామన్న మర్రి
  • భూమి మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక
తెలంగాణ పోలీసుల పనితీరుపై నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీసు అధికారుల పేర్లను రాసి పెట్టుకుంటున్నామని, వారిని భూమి మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బానిసలుగా మారిపోయారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి గురించి సోషల్ మీడియాలో ఎవరు ఏ చిన్న పోస్ట్ పెట్టినా, తెల్లారేసరికి పోలీసులు వారి ఇళ్ల ముందు వాలిపోతున్నారని ఆయన విమర్శించారు.

"కందనూలు ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి ఎస్సై, సీఐ, డీఎస్పీ పేరు రాసి పెట్టుకుంటున్నాం. మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం" అని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కేవలం ఒక కల మాత్రమేనని, రాబోయే 20 ఏళ్ల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని ఆయన జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ నేతల మాటలు విని పోలీసులు తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకోవద్దని సూచించారు. కొందరు అధికారులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా, కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు న్యాయం వైపు నిలబడాలని, ప్రజాస్వామ్యంలో అసభ్యంగా మాట్లాడకుండా ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చని ఆయన హితవు పలికారు. 

More Telugu News