: జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు.. పవన్‌ను సర్‌ప్రైజ్ చేసిన చిరంజీవి

  • నేడు మెగాస్టార్ 70వ పుట్టినరోజు 
  • అన్నయ్యకు పవన్ కల్యాణ్ బ‌ర్త్‌డే విషెస్
  • తమ్ముడికి విజయోస్తంటూ చిరంజీవి ట్వీట్
ఇవాళ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలాగే సినీ, రాజకీయ, ఇత‌ర‌ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చిరుకు జన్మ‌దిన‌ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తన అన్నయ్య చిరంజీవికి విషెస్ తెలుపుతూ, ఆయన పట్టుదల, కార్యదీక్షతలను కొనియాడారు. 

మెగాస్టార్ దీనిపై స్పందిస్తూ, పవన్ కు ఆశీస్సులు అందజేశారు. ఈ మేర‌కు చిరు ప్ర‌త్యేకంగా ఓ ట్వీట్ చేశారు. 'జ‌న సైన్యాధ్యక్షుడికి విజ‌యోస్తు!' అంటూ అన్న‌య్య చేసిన పోస్టు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  

"జ‌న సైన్యాధ్యక్షుడికి విజ‌యోస్తు!.. త‌మ్ముడు క‌ల్యాణ్‌.. ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట‌.. ప్రతీ అక్షరం నా హృద‌యాన్ని తాకింది. అన్నయ్యగా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో.. ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదక్షత‌, ప‌ట్టుద‌ల చూసి ప్రతీ క్షణం గ‌ర్వప‌డుతూనే ఉన్నా. నిన్ను న‌మ్మిన‌వాళ్లకు ఏదో చేయాల‌న్న త‌ప‌నే నీకు ఎప్పటిక‌ప్పుడు కొత్త శ‌క్తిని ఇస్తుంది. 

ఈ రోజు నీ వెనుక కోట్లాది మంది జన‌సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై న‌డిపించు. వాళ్ల ఆశ‌లకు, క‌ల‌ల‌కు కొత్త శ‌క్తినివ్వు. అభిమానుల‌ ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా ల‌భిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచ‌నాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతీ అడుగులోనూ విజ‌యం నిన్ను వ‌రించాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని కోరుకొంటున్నాను" అంటూ చిరు రాసుకొచ్చారు. 

ఈ ట్వీట్‌కు పవన్ చిన్నతనంలో ఉన్నప్పుడు చిరంజీవి బర్త్ డే వేడుకలు జరగ‌గా.. అప్పుడు కేక్ కట్ చేస్తున్న ఫొటోలను జ‌త‌ చేశారు. ఇలా ప‌వ‌న్‌కు చిరు పాత ఫొటోల‌తో సర్‌ప్రైజ్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. 

More Telugu News