Rahul Dravid: జట్టు ఎప్పుడూ కెప్టెన్‌దే.. రోహిత్ కెప్టెన్సీపై ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rahul Dravid Praises Rohit Sharmas Captaincy
  • కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు
  • జట్టు ఎప్పుడూ కెప్టెన్‌దేనని తాను గట్టిగా నమ్ముతానన్న ద్రవిడ్
  • జట్టును ఎలా నడిపించాలనే దానిపై రోహిత్‌కు పూర్తి స్పష్టత ఉందని వ్యాఖ 
  • రోహిత్ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడిందన్న ద్రవిడ్  
కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ పటిమపై భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించారు. జట్టు ఎప్పుడూ కెప్టెన్‌దే అయి ఉండాలని తాను నమ్ముతానని, ఆ విషయంలో రోహిత్ పనితీరు అద్భుతమని కొనియాడారు. ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన ద్రవిడ్, రోహిత్‌తో తన అనుబంధం గురించి, అతని కెప్టెన్సీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

"ఒక కోచ్‌గా నా అభిప్రాయం ప్రకారం జట్టు ఎప్పుడూ కెప్టెన్‌దే ఉండాలి. కెప్టెన్ నిర్దేశించిన మార్గంలోనే జట్టు ప్రయాణించాలి. కోచ్‌గా మనం అతనికి మద్దతుగా నిలవాలి" అని ద్రవిడ్ తన కోచింగ్ ఫిలాసఫీని వివరించారు. రోహిత్ శర్మకు జట్టును ఎలా నడిపించాలనే దానిపై మొదటి రోజు నుంచే పూర్తి స్పష్టత ఉండేదని ఆయన తెలిపారు. "జట్టు పట్ల రోహిత్‌కు ఎంతో శ్రద్ధ ఉంది. జట్టు వాతావరణం ఎలా ఉండాలి, ఆటగాళ్లను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో అతని ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండేవి" అని ద్రవిడ్ పేర్కొన్నారు.

రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా, రోహిత్ శర్మ కెప్టెన్‌గా భారత జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది. వీరిద్దరి సారథ్యంలో టీమిండియా 2023 ఆసియా కప్, 2024 టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకుంది. అలాగే 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఈ విజయాల వెనుక తమ మధ్య ఉన్న బలమైన బంధం కూడా ఒక కారణమని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు.

"రోహిత్‌తో నా బంధం కేవలం క్రికెట్‌కే పరిమితం కాలేదు. మేమిద్దరం సాయంత్రం వేళల్లో భోజనం చేస్తూ క్రికెట్ కాకుండా ఇతర విషయాల గురించి కూడా సరదాగా మాట్లాడుకునేవాళ్లం. అతనితో సమయం గడపడం చాలా తేలికగా అనిపించేది" అని ద్రవిడ్ చెప్పారు. అండర్-19 స్థాయి నుంచి చూసిన ఒక కుర్రాడు, అద్భుతమైన ఆటగాడిగా, నాయకుడిగా ఎదగడాన్ని చూడటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ద్రవిడ్ పేర్కొన్నారు.
Rahul Dravid
Rohit Sharma
Indian Cricket Team
Team India
Cricket Captaincy
Asia Cup 2023
T20 World Cup 2024
Cricket Coach
Indian Cricket
R Ashwin

More Telugu News