ఒకటే లడ్డూ ఇచ్చారంటూ సీఎం హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు.. అధికారుల పరుగులు

  • ఒకే లడ్డూ ఇచ్చారని సీఎం హెల్ప్‌లైన్‌కు గ్రామస్థుడి ఫిర్యాదు
  • మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ ఘటన
  • రెండు లడ్డూలు అడిగితే ఇవ్వలేదని గ్రామస్థుడి ఆరోపణ
  • దిగొచ్చిన పంచాయతీ అధికారులు.. కిలో స్వీట్లు కొనిస్తామంటూ హామీ
  • గతంలోనూ ఇదే జిల్లాలో ఇలాంటి విచిత్ర ఫిర్యాదులు
సమస్య ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సీఎం హెల్ప్‌లైన్ ఉంటుంది. కానీ, తనకు రెండో లడ్డూ ఇవ్వలేదంటూ ఓ వ్యక్తి ఏకంగా సీఎం హెల్ప్‌లైన్‌కే ఫోన్ చేయడం మధ్యప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ విచిత్ర సంఘటన భింద్ జిల్లాలో చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. గ్రామ పంచాయతీ భవనం వద్ద జెండా వందనం కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ ఉన్నవారందరికీ లడ్డూలు పంచిపెడుతున్నారు. ఈ క్రమంలో కమలేశ్‌ ఖుష్వాహా అనే గ్రామస్థుడి వంతు వచ్చింది. సిబ్బంది అతనికి ఒక లడ్డూ ఇచ్చారు. అయితే, తనకు రెండు లడ్డూలు కావాలని కమలేశ్‌ పట్టుబట్టాడు. ఇందుకు సిబ్బంది నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను, వెంటనే పంచాయతీ భవనం బయటి నుంచే సీఎం హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. జెండా వందనం తర్వాత స్వీట్లు సరిగ్గా పంచడం లేదని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ ఘటనను పంచాయతీ కార్యదర్శి రవీంద్ర శ్రీవాస్తవ ధ్రువీకరించారు. "ఆ గ్రామస్థుడు రోడ్డు పక్కన నిలబడి ఉన్నాడు. మా సిబ్బంది ఒక లడ్డూ ఇచ్చారు. కానీ అతను రెండు కావాలని గొడవపడ్డాడు. ఇవ్వక‌పోవ‌డంతో సీఎం హెల్ప్‌లైన్‌కు కాల్ చేశాడు" అని ఆయన మీడియాకు తెలిపారు.

విషయం చిన్నదే అయినా సీఎం హెల్ప్‌లైన్ వరకు వెళ్లడంతో పంచాయతీ సిబ్బంది నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఫిర్యాదు చేసిన కమలేశ్‌ను శాంతింపజేయడానికి, అతనికి కిలో స్వీట్లు కొనిచ్చి క్షమాపణ చెప్పాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఇదే జిల్లాలో 2020 జనవరిలో కూడా ఇలాంటి వింత ఫిర్యాదు ఒకటి నమోదైంది. ఓ చేతి పంపు పనిచేయడం లేదని ఒకరు ఫిర్యాదు చేయగా, అప్పటి పీహెచ్ఈ అధికారి ఒకరు "ఫిర్యాదు చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదు" అంటూ వివాదాస్పదంగా జవాబివ్వడం గమనార్హం.




More Telugu News