Ganesha: ప్రపంచంలో అత్యంత ఎత్తయిన వినాయక విగ్రహం ఎక్కడుందో తెలుసా... భారత్ లో కాదు!

Tallest Ganesha Statue is in Thailand Not India
  • ప్రపంచంలోనే ఎత్తైన గణేశుడి నిలుచున్న విగ్రహం థాయిలాండ్‌లో
  • సుమారు 128 అడుగుల ఎత్తులో కాంస్య విగ్రహం
  • చాచోయెంగ్‌సావ్‌ను 'గణేశ నగరం'గా పిలుస్తున్న వైనం
  • థాయ్‌ ప్రజలు 'ఫ్రా ఫికానెట్'గా కొలిచే వినాయకుడు
  • హిందువులతో పాటు బౌద్ధులకు కూడా ముఖ్య పుణ్యక్షేత్రం
  • 854 భాగాలతో నాలుగేళ్ల పాటు సాగిన నిర్మాణం
సాధారణంగా వినాయకుడి విగ్రహాలు కూర్చున్న స్థితిలో ఉంటాయి. నిలుచున్న స్థితిలో ఉండే గణేశుడి విగ్రహాలు చాలా అరుదు. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడి (నిలుచున్న స్థితి) విగ్రహం ఎక్కడుందంటే చాలామంది భారత్‌లో అనే సమాధానం చెబుతారు. కానీ, ఆ రికార్డు మన దేశానికి కాదు, థాయిలాండ్‌కు దక్కింది. సుమారు 14 అంతస్తుల భవనమంత ఎత్తులో, నిలుచున్న భంగిమలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వినాయకుడి కాంస్య విగ్రహం థాయిలాండ్‌లో కొలువై ఉంది.

థాయిలాండ్‌లోని చాచోయెంగ్‌సావ్ ప్రావిన్స్‌లో ఉన్న ఖ్లాంగ్ ఖుయాన్ గణేశ ఇంటర్నేషనల్ పార్క్‌లో ఈ భారీ విగ్రహం ఉంది. సుమారు 128 అడుగుల (39 మీటర్లు) ఎత్తు ఉన్న ఈ కాంస్య విగ్రహాన్ని 854 వేర్వేరు భాగాలను అతికించి రూపొందించారు. 2008లో మొదలైన దీని నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టింది. 2012 నుంచి ఇది భక్తులకు, పర్యాటకులకు అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది.

థాయిలాండ్‌లో గణేశుడిని 'ఫ్రా ఫికానెట్' పేరుతో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆటంకాలను తొలగించి, విజయాన్ని అందించే దేవుడిగా అక్కడి ప్రజలు, ముఖ్యంగా బౌద్ధులు కూడా గణపతిని విశేషంగా ఆరాధిస్తారు. ఈ కారణంగానే ఈ ప్రదేశం హిందువులతో పాటు బౌద్ధులకు కూడా ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా మారింది. ఈ విగ్రహంలోని గణనాథుడు నాలుగు చేతుల్లో పనస, చెరకు, అరటి, మామిడి పండ్లను ధరించి ఉంటారు. ఇవి వరుసగా సమృద్ధి, ఆనందం, పోషణ, జ్ఞానానికి ప్రతీకలుగా నిలుస్తాయి.

చాచోయెంగ్‌సావ్‌ను 'గణేశ నగరం' అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఈ నిలుచున్న విగ్రహంతో పాటు, మరో రెండు భారీ గణపతి విగ్రహాలు (కూర్చున్న, పడుకున్న భంగిమల్లో) కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తూ ఒక ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతోంది.
Ganesha
Tallest Ganesha Statue
Thailand
Khlong Khuean Ganesha International Park
Chachoengsao
Fra Phikanet
Hinduism
Buddhism
Ganesh Idol Thailand

More Telugu News