Parliament Monsoon Session: ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు... హైలైట్స్ ఇవిగో!

Parliament Monsoon Session ends and Highlights
  • వాడీవేడి చర్చలు, నిరసనల మధ్య ముగిసిన పార్లమెంటు సమావేశాలు
  • 120 గంటలు జరగాల్సిన సభ కేవలం 37 గంటలు మాత్రమే జరిగిన సమావేశాలు  
  • అనేక బిల్లులకు ఆమోదం 
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడి వాగ్వాదాలు, అనూహ్య పరిణామాల మధ్య గురువారంతో ముగిశాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ ఆకస్మిక రాజీనామా, ‘ఆపరేషన్ సిందూర్’ పై ప్రధాని నరేంద్ర మోదీ-కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్య తీవ్ర వాగ్వాదం వంటి కీలక పరిణామాలతో సభ దద్దరిల్లింది. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)’కు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళనలతో సమావేశాలు చివరి వరకు గందరగోళంగానే సాగాయి.

ఈ సమావేశాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన పరిణామాలు ఇవి

1. ఉపరాష్ట్రపతి రాజీనామా: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. ఇంకా రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే ఆరోగ్య కారణాలను చూపుతూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆకస్మిక పరిణామం జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

2. మోదీ-రాహుల్ మధ్య మాటల యుద్ధం: ‘ఆపరేషన్ సిందూర్’ అంశంపై లోక్‌సభలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్‌ను గుడ్డిగా నమ్ముతోందని మోదీ విమర్శించగా, ప్రభుత్వం భారత పైలట్ల సామర్థ్యాన్ని తక్కువ చేసిందని, కేవలం మోదీ ప్రతిష్ఠను కాపాడేందుకే ఈ ఆపరేషన్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

3. ఎస్ఐఆర్ పై విపక్షాల ఆందోళన: బీహార్ ఎన్నికల ముందు చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి పార్లమెంటు లోపల, బయట పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. ‘ఓట్ల దొంగతనాన్ని ఆపండి’ (స్టాప్ వోట్ చోరీ) అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేసింది.

4. కీలక బిల్లులకు ఆమోదం: ఈ సమావేశాల్లో రాజ్యసభ ‘ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025’కి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆన్‌లైన్‌లో డబ్బుతో ఆడే ఆటలను, వాటి ప్రకటనలను నిషేధిస్తుంది. మరోవైపు, తీవ్రమైన నేరారోపణలపై 30 రోజులు నిర్బంధంలో ఉన్న ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులు రాజీనామా చేయాలని నిర్దేశిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టారు.

5. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో దక్షిణాది పోరు: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటములు రెండూ దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులనే బరిలోకి దింపాయి. ఎన్డీఏ తరఫున తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున తెలంగాణకు చెందిన జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి పోటీలో నిలిచారు.

6. ఆరోపణలపై త్రిసభ్య కమిటీ: జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ‘క్యాష్-ఎట్-హోమ్’ ఆరోపణలపై విచారణకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సుప్రీంకోర్టు జడ్జి అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, సీనియర్ అడ్వొకేట్ పీవీ ఆచార్య సభ్యులుగా ఉన్నారు.

7. సభా పనితీరుపై స్పీకర్ అసహనం: విపక్షాలు ప్రణాళిక ప్రకారమే సభా కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించాయని స్పీకర్ ఓం బిర్లా విమర్శించారు. మొత్తం 120 గంటలు జరగాల్సిన సభ కేవలం 37 గంటలు మాత్రమే పనిచేసిందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో లోక్‌సభ 12, రాజ్యసభ 14 బిల్లులను ఆమోదించాయి.
Parliament Monsoon Session
Jagdeep Dhankhar
Narendra Modi
Rahul Gandhi
Operation Sindoor
Bihar Elections
Online Gaming Bill 2025
Om Birla
Indian Politics
Monsoon Session Highlights

More Telugu News