Rahul Mamkootathil: నటి లైంగిక వేధింపుల ఆరోపణల ఎఫెక్ట్: యూత్ కాంగ్రెస్ పదవికి ఎమ్మెల్యే రాజీనామా

Rahul Mamkootathil Resigns Amid Actress Harassment Claims
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్‌కూటథిల్‌పై నటి రిని జార్జ్ లైంగిక వేధింపుల ఆరోపణలు
  • మలయాళ నటి ఆరోపణలతో కేరళ రాజకీయాల్లో కలకలం
  • తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నేత
మలయాళ సినీ నటి రిని జార్జ్ చేసిన తీవ్ర ఆరోపణలు కేరళ రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన యువజన నేత తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి రిని ఆరోపించడంతో, ఈ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌పై యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఇటీవల ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో రిని జార్జ్ మాట్లాడుతూ, ఓ రాజకీయ నేత సోషల్ మీడియా ద్వారా పరిచయమై మూడేళ్లుగా అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడని ఆరోపించారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో గది బుక్ చేస్తానని, తనను అక్కడికి రమ్మని ఆహ్వానించాడని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై పార్టీ సీనియర్ నేతలకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, పైగా ఆ నేతకు పార్టీలో వరుసగా కీలక పదవులు కట్టబెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. ఎవరూ పట్టించుకోరు" అని ఆ నేత తనను బెదిరించినట్లు రిని జార్జ్ తెలిపారు.

నటి ఆరోపణలు వైరల్ కావడంతో, ఈ వివాదం వెనుక ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌ అని కేరళ బీజేపీ ఆరోపించింది. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పాలక్కాడ్‌లోని ఆయన కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ మమ్‌కూటథిల్‌ తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. "నాపై ఫిర్యాదు చేసిన వారు వారి ఆరోపణలను కోర్టులో నిరూపించుకోవాలి. నాపై ఎక్కడా ఎలాంటి కచ్చితమైన ఫిర్యాదు నమోదు కాలేదు" అని ఆయన సవాల్ విసిరారు.

వ్యవస్థపై నమ్మకం లేకపోవడం, భద్రతా కారణాల వల్ల తాను పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని నటి రిని జార్జ్ స్పష్టం చేశారు. "నాకు కేవలం మెసేజ్‌లు మాత్రమే వచ్చాయి. కానీ, ఆ నేత వల్ల వేధింపులు ఎదుర్కొన్న ఇతర మహిళల తరఫున నేను మాట్లాడుతున్నాను" అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తాము దృష్టి సారించామని, తగిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ తెలిపారు. 
Rahul Mamkootathil
Rini George
Kerala
Youth Congress
sexual harassment allegations
VD Satheesan
Kerala politics
Congress MLA
BJP protest

More Telugu News