Rajesh Sakaria: ఢిల్లీ సీఎంపై దాడి కేసు: శివుడి ఆజ్ఞ మేరకే చేశానంటున్న నిందితుడు

Delhi CM Attack Accused Claims Divine Order from Shiva
  • ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి చేసిన రాజేశ్ సకారియా అరెస్ట్
  • శివుడి ఆజ్ఞ మేరకే సీఎంను కలిశానంటూ నిందితుడి వింత వాదన
  • వీధికుక్కలను తరలించవద్దని కోరేందుకే ఢిల్లీకి వచ్చినట్లు వెల్లడి
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి కేసులో నిందితుడు చెబుతున్న మాటలు పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వీధికుక్కల కోసం తాను సీఎంపై దాడి చేశానని, అలా చేయమని తనకు శివుడే చెప్పాడని నిందితుడు రాజేశ్ సకారియా వెల్లడించాడు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో 8 వారాల్లో వీధికుక్కలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన జంతు ప్రేమికుడైన రాజేశ్ సకారియాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో అతడు టికెట్ లేకుండానే రైలెక్కి గుజరాత్ నుంచి హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నాడు. నిన్న షాలిమార్ బాగ్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి, వీధికుక్కలను తరలించవద్దని కోరుతూ ఆమెకు ఒక వినతిపత్రం సమర్పించాడు.

ఆమె నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహానికి గురైన సకారియా, ముఖ్యమంత్రితో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో ఆమె చెంపపై కొట్టి, దుర్భాషలాడాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసుల విచారణలో సకారియా వింతైన విషయాలు వెల్లడించాడు. తాను శివుని భక్తుడినని, వీధికుక్కల సమస్యపై ఢిల్లీ వెళ్లి సీఎం సహాయం కోరమని సాక్షాత్తూ శివుడే తనకు చెప్పాడని పేర్కొన్నాడు. అయితే, సకారియా చెబుతున్న ఈ దైవప్రేరణ సిద్ధాంతాన్ని ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా కొట్టిపారేశారు. ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని, నిందితుడు ఒక ప్రొఫెషనల్ నేరస్తుడని ఆరోపించారు. సకారియాపై గతంలో మద్యం అక్రమ రవాణా సహా అనేక కేసులు ఉన్నాయని, కొన్నింటిలో నిర్దోషిగా బయటపడినా, మరికొన్ని కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ దాడిలో సీఎంకు తీవ్ర గాయాలయ్యాయని, ఆమె కోలుకోవడానికి సమయం పడుతుందని మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం సకారియాపై పోలీసులు హత్యాయత్నం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Rajesh Sakaria
Delhi CM attack
Rekha Gupta
Kapil Mishra
Delhi news
street dogs
Gujarat
crime news
Shiva order

More Telugu News